తెలుగు టాప్ హీరోల విద్యార్హ‌త‌లు

Update: 2023-01-20 00:30 GMT
ఈ రోజుల్లో గ్రాడ్యుయేష‌న్ చాలా కామ‌న్. నిజానికి ఎంపిక చేసుకున్న వృత్తిలో రాణించ‌డ‌మే పెద్ద పీ.హెచ్.డి అనుకోవాలి. కానీ మ‌న స్టార్లు క‌ళారంగంలో ట్యాలెంట్ ని నిరూపించుకోవ‌డంతో పాటు డిగ్రీలు సాధిస్తున్నారు. టాలీవుడ్ లో గ్రాడ్యుయేష‌న్ ఎంత మంది పూర్తి చేసారు? ప్ర‌తిభ‌తో పాటు ప‌ట్టాలు సంపాదించిన హీరోలు ఎంద‌రున్నారు? అన్నది ఆరా తీస్తే తెలిసిన సంగ‌తులివి...

లెజెండ‌రీ క‌థానాయ‌కుడు నందమూరి తార‌క రామారావు డిగ్రీ పూర్తి చేసారు. పిల్లలు ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత సాధారణంగా పాఠశాలకు పంప‌క‌పోయినా.. కుటుంబంలో మొదటి మగ సంతానం కాబ‌ట్టి రామారావును అతని తండ్రి విజయవాడకు పంపి చ‌దివించారు. అక్కడ ఎన్.టి.రామారావు తన విద్యను కొనసాగించారు.1940లో మెట్రిక్యులేట్ చేసి SRR & CVR కళాశాలలో ఇంట‌ర్ చదివారు. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసారు. చ‌దువుల త‌ర‌వాత గుంటూరు ప్ర‌త్తిపాడులో స‌బ్ రిజిస్ట్రార్ గాను తార‌క రామారావు ప‌ని చేసారు. అటుపై న‌టుడయ్యాక క‌థంతా తెలిసిందే.

న‌ట‌శిఖ‌రం అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌ట‌న‌పై మ‌క్కువ‌తో ప‌ద‌వ‌త‌ర‌గతితోనే విద్య‌ను ముగించి సినిమాల్లోకి వ‌చ్చారు. సూప‌ర్ ప్టార్ కృష్ణ సి. ఆర్ కాలేజీలో డిగ్రీ చేసారు. అక్కినేని నాగార్జున అమెరికాలోని ఈస్ట‌ర్న్ మిచిగాన్ యూనివ‌ర్సీటీలో ఆటో మొబైల్ ఇంజ‌నీరింగ్ చేసారు. అందులో ఎమ్మెస్ కూడా పూర్తిచేసారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి న‌ర‌సాపురం వైఎం కాలేజీలో బికాం డిగ్రీ పూర్తి చేసారు. న‌టుడ‌య్యాక ఇంతింతై అన్న‌చందంగా స్వ‌యంకృషితో ఎదిగిన చిరు టాలీవుడ్ ని ఎదురేలేని హీరోగా ఇప్ప‌టికీ ఏల్తున్నారు. ఆయ‌న‌తో క‌లిసి చ‌దువుకున్న‌వారిలో చాలా మంది డాక్ట‌ర్లు ఇంజినీర్లు పారిశ్రామిక వేత్త‌లుగాను ఎదిగారు. ద‌గ్గుబాటి కాంపౌండ్ లో విక్ట‌రీ వెంక‌టేష్ అమెరికాలో మానిట‌రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డీస్ లో ఎంబిఏ పూర్తి చేసారు. ఇక న‌ట‌సింహా బాల‌కృష్ణ హైద‌రాబాద్ నిజాం కాలేజీ నుంచి కామ‌ర్ప్ ప‌ట్టా పొందారు. అలాగే రాజ‌శేఖ‌ర్ ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్ట‌ర్ గా ప్రాక్టీస్ చేశారు.

ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లండ‌న్ స్కూల్ ఆఫ్ ఆర్స్ట్ లో డిగ్రీ చేసారు.  స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ బ్యాచిల‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ ఎంఎస్ ఆర్ కాలేజీలో పూర్తి చేసారు.  డార్లింగ్ ప్ర‌భాస్ భీమ‌వ‌రం డీఎన్ ఆర్ స్కూల్లో చ‌దివాక శ్రీ చైత‌న్య‌లో బీటెక్ పూర్తి చేశారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్.. రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ.. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య లు బికాం స్టడీస్ కామ్ గా పూర్తి చేసారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసారు. నేటిత‌రం స్టార్లు పీజీలు బిజినెస్ స్కూల్ స్ట‌డీస్ పూర్తి చేసి పెద్ద ఉద్యోగాలు చేసి సినీరంగంలోకి వ‌చ్చిన వాళ్లు ఉన్నారు. చాలా మంది డిగ్రీల‌తో ప‌ని లేకుండా స్టార్లుగా రాణిస్తున్నారు. నిజం చెప్పాలంటే కొంద‌రికి సినీరంగంలోనే టెన్త్ ఇంట‌ర్ డిగ్రీ పీహెచ్ డి అన్నీ పూర్త‌వుతున్నాయి. పీహెచ్ డిలు పూర్తి చేసిన‌ డాక్ట‌ర్ల కంటే యాక్ట‌ర్ల‌కు ఉండే అసాధార‌ణ ఫాలోయింగ్ గురించి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News