'ఎఫ్ 2' భామలకు 'ఎఫ్ 3' ఏమాత్రం ఉపయోగపడలేదా..?

Update: 2022-06-07 02:30 GMT
విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ''ఎఫ్ 3''. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో తమన్నా భాటియా - మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాపై ముద్దుగుమ్మలిద్దరూ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇది వారికి ఏమాత్రం ఉపయోగపడలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో.. అదే ప్రాంఛైజీలో ''ఎఫ్ 3'' చిత్రానికి శ్రీకారం చుట్టారు. అవే క్యారెక్టరైజేషన్లతో కొత్త కథతో తెరకెక్కించారు. అప్పుడు భార్యాభర్తల స్టోరీకి ఫన్ అండ్ ఫస్ర్టేషన్ కలిపి చూపిస్తే.. ఈ సినిమాలో డబ్బు చుట్టూ తిరుగే కథను రెట్టింపు వినోదాన్ని అందించేలా తీర్చిదిద్దారు.

ఇందులో 'F 2' భామలు తమన్నా - మెహరీన్ కూడా కంటిన్యూ అయ్యారు. సోనాల్ చౌహాన్ కీలక పాత్ర పోషించగా.. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అయితే ఈ సినిమాకు గ్లామర్ జోడించినప్పటికీ, హీరోయిన్లకు పెద్దగా పేరు రాలేదు. మెహ్రీన్ పాత్ర ప్రథమార్ధంలో పర్వాలేదనిపించినా లుక్స్ పరంగా ఎబ్బెట్టుగా అనిపించింది.

తమన్నా ను రెండు పాత్రల్లో చూపించడానికి ట్రై చేసినా.. ఏమంత ఎఫెక్టివ్ గా లేవు. ఆమె 'ఎఫ్ 3' సినిమాలో మరీ నామమాత్రంగా అనిపిస్తుంది. మిగతా పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉండటంతో.. హీరోయిన్లకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. దీంతో ఇద్దరు ప్రధాన కథానాయికలకు నిరాశే ఎదురైందని చెప్పాలి.

'ఎఫ్ 2' తర్వాత మెహ్రీన్ వరుస అవకాశాలు దక్కించుకుంది కానీ.. విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. మరోవైపు తమన్నా లైనప్ లో సినిమాలు ఉంటున్నాయి కానీ.. చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం లేదు. అందుకే 'ఎఫ్ 3' సినిమా ఇద్దరికీ కీలకంగా మారింది. కాకపోతే ఈ సినిమాలో మిగతా వారికి పేరొచ్చినంతగా వీరికి రాలేదనే చెప్పాలి.

కాగా, 'ఎఫ్ 3' సినిమా తొలి రోజే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. చెప్పుకోడానికి కథ ఏమీ పెద్దగా లేకపోయినా.. ఆధ్యంతం నవ్వులు పంచడంతో ప్రేక్షకులు లాజిక్స్ గురించి పట్టించుకోకుండా ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో ఈ కామెడీ ఎంటర్టైనర్ రెండో వారంలో అడుగుపెట్టింది.

అయితే మేకర్స్ అంత కలెక్ట్ చేసింది ఇంత వసూలు చేసిందని పోస్టర్స్ వదులుతున్నప్పటికీ.. చాలా ఏరియాల్లో బయ్యర్లు ఇప్పటికీ డెఫిసిట్ లో ఉన్నారని తెలుస్తోంది. 'ఎఫ్ 2' సక్సెస్ ని దృష్టిలో పెట్టుకొని 'ఎఫ్ 3' సినిమాను అధిక రేట్లకు అమ్మారు. కానీ బాక్సాఫీస్ లెక్కలు వేరేలా ఉన్నాయని అంటున్నారు.

అందులోనూ ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'మేజర్' మరియు 'విక్రమ్' సినిమాలు రెండూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఫస్ట్ వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని చూపించాయి. మరి ఈ రెండు చిత్రాలను తట్టుకొని 'ఎఫ్ 3' సినిమా ఏ మేరకు కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.
Tags:    

Similar News