వైజాగ్ లో 32 ఎక‌రాల్లో ఫిలింస్టూడియో ప్లాన్?!

Update: 2022-10-15 07:00 GMT
విశాఖ న‌గ‌రంలో బీచ్ ప‌రిస‌రాల్లో ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత‌కు కొన్ని ఎక‌రాల్లో ఫిలింస్టూడియో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల క‌రోనా క్రైసిస్ కార‌ణంగా ఈ స్టూడియోలో సినిమాల నిర్మాణం త‌గ్గింద‌ని టాక్ వినిపించింది. నిజానికి టాలీవుడ్ సినిమాలు స‌హా త‌మిళం క‌న్న‌డ‌ ఒడియా చిత్రాలు ఎక్కువ‌గా ఈ స్టూడియోలో చిత్రీక‌ర‌ణ‌లు జ‌రుపుకునేవి. విశాఖ నుంచి కూత‌వేటు దూరంలోనే అర‌కు అందాలు అందుబాటులో ఉండ‌డంతో మేకర్స్ విశాఖ‌- అర‌కు బెల్ట్ లోనే భారీ షెడ్యూళ్ల‌ను ప్లాన్ చేసేవారు. ఇక్క‌డ హిందీ సినిమాలు బోజ్ పురి సినిమాల‌ను కూడా గ‌తంలో షూట్ చేయ‌డం విశేషం.

కానీ ఇటీవ‌ల స‌ద‌రు సినీ స్టూడియో క‌ళ త‌ప్పింద‌ని టాక్ కూడా వినిపిస్తోంది. క‌రోనా క్రైసిస్ త‌ర్వాత‌ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో షూటింగులు త‌గ్గాయి. ఇందులో సెట్స్ కూడా పాత బ‌డ్డాయి. అలాగే పాత కాలం నాటి సినిమా ఎక్విప్ మెంట్ తో ఈ స్టూడియోస్ లోని మ్యూజియం కూడా క‌ళ త‌ప్పి పాత‌బ‌డి అలానే ఉండిపోయింది. రెనోవేష‌న్ ప్ర‌క్రియ‌లపై స‌ద‌రు స్టూడియో అధినేత‌కు ఆస‌క్తి స‌న్న‌గిల్లిపోయింద‌ని కూడా గ‌త కొంత‌కాలంగా టాక్ వినిపిస్తోంది.

నిజానికి భారీ ఫిలిం స్టూడియో నిర్మాణం పేరుతో అప్ప‌ట్లోనే ఏకంగా 32 ఎక‌రాలు ప్ర‌భుత్వం నుంచి కొనుగోలు చేసారు. కానీ ఇందులో కేవ‌లం 2 ఎక‌రాల్లో మాత్ర‌మే స్టూడియోని నిర్మించి మిగ‌తా 30 ఎక‌రాల్ని అలానే ఖాళీగా ఉంచారు. నిర్వ‌హ‌ణా భారం పెర‌గ‌కుండా అదుపులో ఉంచేందుకు స్టూడియోలో ప‌రిమితంగా స్టాఫ్ ని నియ‌మించార‌ని టాక్ వినిపించింది.

కానీ ఫిలింస్టూడియో పేరుతో కొన్ని ఎక‌రాల స్థ‌లం ఖాళీగా ఉండ‌డంతో దీనిపై ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ క‌న్ను ప‌డింద‌ని ఈ స్థ‌లాన్ని నూత‌న రాజ‌ధానికి అనుకూలంగా స‌ద్వినియోగం చేయాల‌ని భావించార‌ని కూడా అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి. వైకాపా ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఈ స్టూడియోస్ లో స‌రిగా షూటింగులు జ‌ర‌గ‌డం లేద‌ని వాకబు జ‌ర‌గ‌డం ఆ స్థ‌లాన్ని ప్ర‌భుత్వ అవ‌స‌రాల‌కు వినియోగించాల‌ని ఒత్తిళ్లు రావ‌డంతో దానిపై చాలా టాక్ వినిపించింది. అలాగే అక్క‌డ షూటింగులపై ఆస‌క్తి స‌న్నగిల్లింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

అయితే తాజా స‌మాచారం మేర‌కు... విశాఖ రాజ‌ధాని అంశం మ‌రోసారి తెర‌పైకి రాగానే ఇప్పుడు స్టూడియో అధినేత‌ ప్లాన్ మారుతోంద‌ని టాక్ వినిపిస్తోంది. ఈ స్టూడియోలో అద‌నంగా సినిమాల నిర్మాణానికి అనుకూలంగా ఒక ఫిలిం హ‌బ్ ని అభివృద్ధి చేసే విధంగా భారీ ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగ‌నున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ రెండెక‌రాల్లో మాత్ర‌మే స్టూడియో నిర్వ‌హించ‌గా ఇక‌పై 32 ఎక‌రాల స్థ‌లాన్ని స్టూడియోలు స‌హా ఇత‌ర ల్యాబులు వ‌గైరా నిర్మాణం చేప‌ట్టేందుకు యోచిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. హైద‌రాబాద్ లో భారీ స్టూడియోని నిర్మించి దానిని ప‌రిశ్ర‌మ‌కు అంకిత‌మిచ్చిన అదే ఫ్యామిలీ ఇప్పుడు విశాఖ‌లో ఫిలింస్టూడియోని కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిలింఇండ‌స్ట్రీ అభివృద్ధికి కేటాయించ‌నుంద‌ని కూడా గుసగుస వినిపిస్తోంది.

ప్ర‌స్తుత వైకాపా ప్ర‌భుత్వ‌మైనా లేదా తేదేపా ప్ర‌భుత్వమైనా ఇంకే ప్ర‌భుత్వం వ‌చ్చినా విశాఖ‌లో సినీప‌రిశ్ర‌మ అభివృద్ధికి తాము ఎప్పుడూ అనుకూల‌మేన‌ని సందేశం ఇచ్చేందుకే ఈ ప్ర‌య‌త్నం అన్న గుస‌గుసా వినిపిస్తోంది. ప్ర‌భుత్వం నుంచి స్థ‌లాన్ని కొనుక్కున్న (లీజ్ కాదు) హ‌క్కుదారుగా తాము ఇక్క‌డ ఎలాంటి వ్యాపారం అయినా చేసే హక్కు ఉంది. కానీ ఈ స్థ‌లాన్ని సినీప‌రిశ్ర‌మ అభివృద్ధికే కేటాయించాల‌ని భావించ‌డం చూస్తుంటే ఆ కుటుంబానికి ప‌రిశ్ర‌మ‌పై ఉన్న క‌మిట్ మెంట్ అంత గొప్ప‌ది అన్న గుస‌గుసా వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News