90వేల డాలర్ల బ్యాగ్ తో దేశం దాటిన ఇమ్రాన్ భార్య ఫ్రెండ్.. అక్రమాస్తుల లేడీ పరార్

Update: 2022-04-06 23:30 GMT
పాకిస్తాన్ లో పౌర ప్రభుత్వం కుప్పకూలాక అందరూ సర్దుకుంటున్నారు.. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిని కోల్పోయాక  తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది.  ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు దేశం విడిచి పారిపోతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఇమ్రాన్ ఖాన్ మూడో భార్య బుస్రా  బీబీ స్నేహితురాలు ఫరాఖాన్ దుబాయ్ వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.

ఈ క్రమంలోనే ఫరాఖాన్ లగ్జరీ విమానంలో  కాలుమీద కాలు వేసుకొని కూర్చొని ఓ ఖరీదైన బ్యాగ్ ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఫొటో ఆమె తీసుకుందో ఎవరో తీసి షేర్ చేశారో తెలియదు కానీ వైరల్ అవుతోంది.

ఫరాఖాన్ దుబాయికి వెళ్లిపోవడంపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.90వేల అమెరికన్ డాలర్ల బ్యాగ్ తో ఆమె పారిపోయిందని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత రొమినా ఖుర్షిద్ ఆలం ట్విట్టర్ లో ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఒక ఫొటోను షేర్ చేశారు. దీనిపై పలువురు కామెంట్లు పెడుతున్నారు.

పాకిస్తాన్ నుంచి ఓ ప్రైవేట్ జెట్ లో దుబాయికి వెళ్లాలంటే 50వేల డాలర్ల కన్నా ఎక్కువ మొత్తమే ఖర్చువుతోందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరోవైపు ఫరాఖాన్ భర్త ఆమె కన్నా ముందే  పాకిస్తాన్ విడిచి వెళ్లినట్లు కూడా వార్తలొచ్చాయి. ఆమె బ్యాగు ఖరీదు దాదాపు 90వేల డాలర్లని ఇక అక్రమంగా ఎంత సంపాదించి ఉంటారో అని ముక్కున వేలేసుకుంటున్నారు.

పాకిస్తాన్ లో అధికారులు తాము కోరుకున్న చోటకు బదిలీలు, పోస్టింగ్ లు ఇప్పించడం ద్వారా ఆమె భారీ మొత్తంలో డబ్బు దండుకున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కుంభకోణాన్ని పాకిస్తాన్ లో 'మదర్ ఆఫ్ స్కాండల్స్'గా పేర్కొంటున్నారు. దీని విలువ 6 బిలియన్ల పాకిస్తానీ రూపాయలుగా ఉంటుందని మండిపడుతున్నారు.

ఇక ఇమ్రాన్ దిగిపోవడంతో ఆయన హయాంలో అవినీతికి పాల్పడిన వారంతా ఇప్పుడు దేశం దాటిపోవడం సంచలనమవుతోంది. ఇమ్రాన్ కు చెందిన మరికొందరు సన్నిహితులు కూడా దేశం విడిచి పారిపోయేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.
Tags:    

Similar News