'అవ‌తార్ 2'పై ఆస్కార్ డైరెక్ట‌ర్ మొద‌టి రివ్యూ

Update: 2022-11-26 15:47 GMT
2022 మోస్ట్ అవైటెడ్ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ 'అవతార్ 2' మొదటి సమీక్ష వ‌చ్చేసింది! ఆస్కార్ గ్ర‌హీత‌.. దర్శకుడు గిల్లెర్మో డెల్ టోరో స్పంద‌న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అకాడమీ అవార్డ్ విజేత.. దర్శకుడు గిల్లెర్మో డెల్ టోరో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' మొట్టమొదటి సమీక్షను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో షేర్ చేసారు. దీంతో అవతార్ అభిమానుల్లో మ‌రింత ఉత్కంఠ పెరిగింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన చిత్రం అవతార్ 2 డిసెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుండ‌గా గిల్లెర్మో రివ్యూ ఒక్క‌సారిగా హీట్ ని పెంచింది.

అవ‌తార్ 2 చిత్రాన్ని ఇప్పటికే గిల్లెర్మో వీక్షించారు. ఈ చిత్రంపై తన మొదటి సమీక్షను షేర్ చేయ‌గానే అది వైర‌ల్ గా మారింది. వెంట‌నే ఈ సినిమాని 3డి విజువ‌ల్స్ లో చూడాల‌న్న కుతూహాలాన్ని మ‌రింత‌గా పెంచుతోంది. అతను ఇలా రాసారు. ''అత్యద్భుతమైన విజయం.. అవ‌తార్ 2 గంభీరమైన .. భావోద్వేగాలతో కూడుకున్న గొప్ప సినిమా. ఇది పురాణేతిహాసాన్ని చూస్తున్నంత‌గా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది'' అని ప్ర‌శంసించారు. అత‌డు శక్తుల శిఖరాగ్రంలో ఒక మాస్టర్...అంటూ కామెరూన్ పైనా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. అవతార్ 2 మొదటి సమీక్షపై అభిమానులు స్పీడ్ గానే స్పందించారు ''ఇది రాజ ముద్ర‌'' అని ''ఆమోద ముద్ర'' అని వ్యాఖ్య‌ల్ని జోడించారు.''వాస్తవాన్ని గుర్తించాం. ఇది అంతిమ ఆమోద ముద్ర'' అంటూ మరొకరు ట్వీట్ చేశారు.

గిల్లెర్మో డెల్ టోరో ఈ చిత్రం వీక్షించిన అనంత‌రం ప్రశంసలు కురిపించారు. నిజానికి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' వర్క్ ఎట్టకేలకు పూర్తయిందని నిర్మాత జోన్ లాండౌ నవంబర్ 24న ట్విట్టర్ లో ప్రకటించారు. సినిమాకి  సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని రాశారు. ద‌ర్శకుడు గిల్లెర్మో డెల్ టోరో ఈ ప్రకటనపై ప్రతిస్పందించారు. చిత్రంపై తన మొట్టమొదటి సమీక్షను పంచుకుని మ‌రింత ఉత్కంఠ‌ను పెంచారు.

గిల్లెర్మో డెల్ టోరో హాలీవుడ్ లో సంచ‌ల‌న చిత్రాల‌ను తెర‌కెక్కించిన మేధావి. ది షేప్ ఆఫ్ వాటర్- నైట్ మేర్ అల్లే-పాన్స్ లాబ్రింత్ వంటి చిత్రాలకు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వచ్చే నెల ప్రారంభంలో తన త‌దుప‌రి చిత్రం 'పినోచియో' విడుదల కోసం వేచి చూస్తున్నాడు. అత‌డు తన తరంలో గొప్ప దృశ్య కథకులలో ఒకరిగా కూడా గుర్తింపు పొందారు.

అదే విషయాన్ని ప్ర‌స్థావిస్తూ ఒక ట్విట్టరాటీ ఇలా వ్యాఖ్యానించారు.  ''ది షేప్ ఆఫ్ వాటర్ నాకు ఇష్టమైన చిత్రాలలో ఒకటి..1వ అవతార్ నా ఫేవరెట్ ఫిల్మ్ లలో మరొకటి. ది వే ఆఫ్ వాటర్ ఈ జాబితాలో చేరుతుంది. మీరు ... అలానే జేమ్స్ కామెరాన్ ఇద్దరూ మాస్టర్ ఫిల్మ్ మేకర్స్‌. నిజమైన కళాకారులు. 2022 ముగింపు సీజన్ సినీప‌రిశ్ర‌మ‌కు గొప్పది. కామెరూన్ కొత్త అవతార్ అంద‌రినీ అల‌రిస్తుంది.. అని వ్యాఖ్యానించారు.

ఇటీవ‌లే మేక‌ర్స్ అవతార్ 2 కొత్త టీజర్ ను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. టీజర్ లో జేక్ సుల్కీ తెగ త‌మ వారిని కాపాడుకునేందుకు.. త‌మ గృహాల‌ను ర‌క్షించుకునేందుకు పోరాటం సాగించ‌డాన్ని... క్రూరులైన‌ మానవులు మరోసారి వారిని ఎలా వేటాడారు? అనేవి చూపించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అవతార్: ది వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రంలో సిగౌర్నీ వీవర్- స్టీఫెన్ లాంగ్- క్లిఫ్ కర్టిస్- జోయెల్ డేవిడ్ మూర్- CCH పౌండర్- ఈడీ ఫాల్కో- జెమైన్ క్లెమెంట్  కేట్ విన్స్ లెట్  త‌దిత‌రులు నటించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News