విడుదలే కష్టం అన్న సినిమాను రూ.40 కోట్ల లాభంకు అమ్మేసిన నిర్మాత

Update: 2020-06-26 10:10 GMT
బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతల్లో కరణ్‌ జోహార్‌ ఒకరు. తక్కువ బడ్జెట్‌ తో సినిమాలను నిర్మించి భారీ మొత్తాలకు అమ్మడంతో పాటు కొత్త వారితో సినిమాలను తక్కువ బడ్జెట్‌ లో నిర్మించి భారీ లాభాలను సొంతం చేసుకోవడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌. స్టార్‌ కిడ్స్‌ ఉన్న క్రేజ్‌ ను ఉపయోగించుకుని వారితో సినిమాలు చేయడం ఈయనకు అలవాటు. శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ తో ఈయన తాజాగా తెరకెక్కించిన సినిమా ‘గుంజన్‌ సక్సేనా’. రియల్‌ లైఫ్‌ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా సమ్మర్‌ లో విడుదల కావాల్సి ఉండగా వైరస్‌ కారణంగా విడుదలకు నోచుకోలేదు.

సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇటీవలే ప్రకటించాడు. జాన్వీ కపూర్‌ కు ఇది రెండవ సినిమా. ఆమెపై దాదాపుగా 30 కోట్ల పెట్టుబడి పెట్టడం ఏంటీ అంత బడ్జెట్‌ వర్కౌట్‌ అయ్యేనా అంటూ చాలా మంది ప్రశ్నించారు. థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్న సమయంలో సరైన బిజినెస్‌ కాకపోవడంతో ఆలోచనల్లో కరణ్‌ జోహార్‌ పడ్డాడు. కాని ఇప్పుడు మాత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ కు ఈ సినిమాను ఏకంగా 70 కోట్లకు అమ్మేశాడట.

బాలీవుడ్‌ లో ప్రస్తుతం ఈ డీల్‌ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఓటీటీలో చిన్న చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. మొదటి సారి ఇంతటి భారీ డీల్‌ తో సినిమా రాబోతుంది. 30 కోట్లు పెట్టిన సినిమాను 70 కోట్లకు అమ్మేయడం అంటే కరణ్‌ జోహార్‌ ఏ స్థాయి ప్రతిభావంతుడో అర్థం చేసుకోవచ్చు. జాన్వీ కపూర్‌ రెండవ సినిమానే అయినా ఈ స్థాయి బిజినెస్‌ చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ బాలీవుడ్‌ వర్గాలు సైతం ఆశ్చర్య పోతున్నాయి. ఆగస్టు 15వ తారీకున స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.
Tags:    

Similar News