OTT రిలీజ్ పై కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేశాడు!

Update: 2021-09-08 15:30 GMT
క‌రోనా మ‌హ‌మ్మారీ అంతా మార్చేసింది. ఇంత‌కుముందులా థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడడం లేదు. దీంతో నిర్మాత‌లు OTT రిలీజ్ ల‌కు వెళుతున్నారు. ప‌రిస్థితి పూర్తిగా దారిలోకి వ‌చ్చే వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి ఉంటుంది. ఇంత‌కుముందు ప‌రిశ్ర‌మ టాప్ ఎగ్జిబిట‌ర్ కం నిర్మాత డి.సురేష్ బాబు సైతం ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకే ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. ఆయ‌న వాస్త‌వ స‌న్నివేశాన్ని విశ్లేషించి త‌మ సినిమాల్ని ఓటీటీ రిలీజ్ ల‌కు విక్ర‌యిస్తున్నారు. వెంకీ నార‌ప్ప త‌ర‌హాలోనే దృశ్యం 2.. రానా విరాట‌ప‌ర్వం ఓటీటీల‌కు వెళ‌తాయ‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

ఇప్పుడు అదే బాట‌లో నాని ట‌క్ జ‌గ‌దీష్ కూడా రిలీజ‌వుతోంది. టక్ జగదీష్ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అవుతోంది. దీనిని ఎగ్జిబిటర్ లు వ్య‌తిరేకిస్తున్నారు. థియేటర్లలో నాని సినిమాలను నిషేధిస్తామని కూడా వారు బెదిరించారు. కానీ దీనిపై నాని కూడా తీవ్రంగా స్పందించారు. అత‌డికి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూడా మద్దతును అందించింది. అలాగే యాక్షన్ హీరో గోపి చంద్ థియేట్రికల్ రిలీజ్ లను దాటవేసే సినిమాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ నానీకి ప‌రోక్షంగా మ‌ద్ధ‌తునిచ్చారు. ఒక‌ర‌కంగా డి.సురేష్ బాబు అభిప్రాయాన్ని ఆయ‌న స‌మ‌ర్థించారు. నిర్మాత‌లు త‌మ ఉత్ప‌త్తిని ఏ వేదిక‌పై రిలీజ్ చేసుకోవాలో వారి నిర్ణ‌యం అన్న‌ట్టే మాట్లాడారు.

తన కొత్త సినిమా సీటీమార్ ప్రమోషన్ లో గోపీచంద్ త‌న అభిప్రాయం చెప్పారు. ``ప్రతి నిర్మాత తమ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు. కొన్ని అనుకోని పరిస్థితులలో OTT విడుదలను ఎంచుకోవలసి ఉంటుంది. నిర్మాతలు ఫైనాన్స్ తీసుకురావడం ద్వారా సినిమాలు చేస్తారు. త్వ‌ర‌గా విడుదల చేసేయ‌క‌పోతే భారం ప‌డుతుంది. వారి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి`` అని గోపీచంద్ అన్నారు. డైరెక్ట్ డిజిటల్ విడుదలను ఎంచుకునే సినిమాల గురించి నేను వ్యాఖ్యానించదలచుకోలేదు. మేము వారిలా ఆలోచించిన‌ప్పుడు మాత్ర‌మే వారి పరిస్థితిని అర్థం చేసుకోగ‌ల‌మ‌ని అన్నారు. గోపీచంద్ చేసిన వ్యాఖ్యలు డి.సురేష్ బాబుకి నానికి ఆయన పరోక్ష మద్దతు గురించి సూచిస్తున్నాయి. నాని కూడా తన సినిమాను మొదట OTT లో విడుదల చేయాలనే నిర్ణయాన్ని ఇష్టపడలేదు. కానీ ప‌రిస్థితి అలా వ‌చ్చింది. గోపిచంద్- త‌మ‌న్నా జంట‌గా సంప‌త్ నంది తెర‌కెక్కించిన సీటీమార్ చిత్రం ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.




Tags:    

Similar News