తప్పు నీది కాదు

Update: 2019-07-04 14:30 GMT
తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పిన విషయం తెల్సిందే. ప్రపంచ కప్‌ టోర్నీకి సెలక్ట్‌ కాకపోవడంపై అసహంతో ఉన్న అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌ లోని మూడు ఫార్మట్‌ లకు గుడ్‌ బై చెప్పాడు. రాయుడు తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం క్రీడా ప్రపంచంతో పాటు పలువురిని ఆశ్చర్య పర్చింది. కొందరు బీసీసీఐ సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు రాయుడు కాస్త వేచి చూస్తే బాగుండేది అంటూ సలహాలు ఇస్తున్నారు.

హీరో సిద్దార్థ్‌ మాత్రం అంబటి రాయుడుకు పూర్తి మద్దతు పలికాడు. సిద్దార్థ్‌ ఈ విషయమై స్పందిస్తూ.. దేశవాలీ క్రికెట్‌ ను చూసే వారికి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు ఎన్నో ఎత్తు పల్లాలను ఎదుర్కొన్నాడు. అయినా కూడా అతడో మంచి ఆటగాడు. అతడి ఆట రీత్యా అంతర్జాతీయ క్రికెట్‌ లో అతడు మరింత బాగా రాణించేవాడు. కాని అతడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇది నీ తప్పు కాదు. నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నానంటూ పేర్కొన్నాడు.

ఇదే సమయంలో బీసీసీఐ తీరుపై కూడా సిద్దార్థ్‌ స్పందించాడు. ఐపీఎల్‌ కు కారణం ఐసీఎల్‌ అనే విషయం అందరికి తెల్సిందే. ఐసీఎల్‌ ను ఒక లెజెండ్రీ క్రికెట్‌ ప్రారంభించారు. ఆ క్రికెటర్‌ ను ఫాలో అవుతూ ఎంతో మంది అందులో జాయిన్‌ అయ్యారు. అయితే బీసీసీ దాన్ని దారుణంగా మూయించేసింది. అదే కొనసాగి ఉంటే వందలాది మంది క్రికెటర్‌ లు ఇప్పుడు తయారయ్యేవారని సిద్దార్థ్‌ అన్నాడు.
Tags:    

Similar News