తెలుగు కుర్రాడు సైలెంటుగా కొట్టేశాడు

Update: 2017-10-26 06:17 GMT
మొన్న దసరా సీజన్లో ‘జై లవకుశ’.. ‘స్పైడర్’ భారీ అంచనాల మధ్య రిలీజయ్యాయి. అవి రెండూ భారీ సినిమాలే. కానీ వాటితో పోలిస్తే తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ‘మహానుభావుడు’ మంచి ఫలితాన్నందుకుంది. బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఐతే ‘జై లవకుశ’.. ‘స్పైడర్’ ఆశించిన స్థాయిలో లేకపోవడం ‘మహానుభావుడు’కు కలిసొచ్చింది. కానీ ఇప్పుడు కోలీవుడ్లో ‘మెర్శల్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పోటీ పడి కూడా ఓ చిన్న సినిమా బాగానే నెట్టుకొచ్చింది. సైలెంటుగా వచ్చిన స్లీపర్ హిట్టయిపోయింది. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ‘మెర్శల్’ కంటే కూడా ఆ చిన్న సినిమానే పెద్ద హిట్ అంటున్నారు. ఆ సినిమా పేరు.. మెయ్యాదమాన్.

సీనియర్ తెలుగు దర్శకుడు కోదండరామిరెడ్డి కొడుకైన వైభవ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మెయ్యాదమాన్’. ఇది ఒక వన్ సైడ్ లవర్ స్టోరీ. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు కొత్త దర్శకుడు రత్నకుమార్. ‘పిజ్జా’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. అందరూ ‘మెర్శల్’ మేనియాలో ఉండగా.. ధైర్యంగా ఈ చిత్రాన్ని దీపావళికి పోటీగా రిలీజ్ చేశాడు. రెండు మూడు రోజులు ఈ సినిమా గురించి పెద్దగా చర్చ లేదు. కానీ ఆ తర్వాత అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మౌత్ టాక్ తో ఈ సినిమా రేంజే మారిపోయింది. వీకెండ్ వచ్చేసరికి దీనికి స్క్రీన్లు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. పొరుగు రాష్ట్రాల్లో కూడా ప్రేక్షకుల డిమాండ్ మేరకు కొత్తగా స్క్రీన్లు జోడించారు. ఈ సినిమాలో వైభవ్ అదరగొట్టేశాడని.. అతడికిది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని అంటున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారట.
Tags:    

Similar News