'బాహుబలి 2' పైరసీ కేసును అలా డీల్ చేశారట!

Update: 2022-02-04 16:30 GMT
'బాహుబలి 2' రిలీజ్ కి ముందు రోజు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి, ఎస్. మదన్ కుమార్

తాజా ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. 'బాహుబలి 2' సినిమా విడుదలకి ముందు నిర్మాతలకు ఒక మెయిల్ వచ్చింది .. ఈ సినిమా పైరసీ ప్రింట్ మా దగ్గర ఉందంటూ పంపించారు. చాలా వరకూ సినిమాలు పైరసీ బారిన పడుతుంటాయనే సంగతి మనకి తెలిసిందే. అయితే 'బాహుబలి 2' విషయానికి వస్తే 100ల కోట్ల ప్రాజెక్టు. ఆ మెయిల్ చేసినవాడు కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టాడు. వాటితో పాటు 2 నిమిషాల చొప్పున కొన్ని క్లిప్స్ పంపించాడు. అవన్నీ కూడా HD ప్రింట్లు. సాధారణంగా పైరసీ వీడియోలు అన్నీ కూడా థియేటర్లో కెమెరాతో తీసినట్టుగా ఉంటాయి.

ఆ మెయిల్లో కంటెంట్ అలా లేదు .. ప్రొడ్యూసర్ ఇచ్చినట్టుగా ఉంది. మొత్తానికి అది లీక్ అయింది .. కానీ బయటికి రాకూడదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూనే నేను బంజారాహిల్స్ లోని 'ఆర్కా మీడియా ఆఫీసుకు వెళ్లాను. తన దగ్గర పైరసీ ప్రింట్ ఉందని చెప్పిన వ్యక్తి, అది బయటికి రాకుండా ఉండాలంటే 50 లక్షలు అడిగాడు. అలాగే ఇస్తామని నేను ఆన్సర్ చేశాను. కాకపోతే చిన్న మెలిక పెట్టాను .. మళ్లీ ఇదే విషయంగా మరొకరు కాల్ చేస్తే పరిస్థితి ఏమిటని అడిగాను. పైరసీ వ్యవహారాలు మొత్తం తానే చూస్తూ ఉంటాననీ, తాను తప్ప ఎవరూ కాల్ చేయరని చెప్పాడు.

రిలీజ్ కి ముందు  మేము ఎక్కడికీ రాలేము .. నువ్వే రావాలి .. ఫ్లైట్ టికెట్స్ .. అకామిడేషన్ అవన్నీ మేమే చూసుకుంటామని చెబితే .. వెంటనే ఎగురుకుంటూ నా ముందుకే వచ్చాడు. నేను ఆర్కా మీడియా పీఆర్ మేనేజర్  మాదిరిగా ఐడీ కార్డు వేసుకుని కనిపించాను. అతణ్ణి ఒక రూమ్ లో కూర్చోబెట్టాను. ఒక పైరసీ చేసే వ్యక్తి ఫ్లైట్ లో రావడం .. ఫైవ్ స్టార్ హోటల్లో ఉండటం .. అంత ధైర్యంగా రావడంతో అసలు వీడి వెనకాల ఎవరున్నారో చూడాలని నేను అనుకున్నాను. అతనికి ఏ మాత్రం డౌట్ రాకుండా ముందు 'చెక్' ఇచ్చేశాము.

నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు మాటిమాటికి బయటికి వెళ్లి అతను ఎవరికో కాల్ చేస్తున్నాడు. ఫ్యూచర్లో అతని అవసరం నాకు ఉంటుందని చెప్పి నెంబర్ తీసుకున్నాను .. అతను ఎవరెవరికి కాల్ చేస్తున్నాడనేది ట్రాక్ చేయడం మొదలు పెట్టాను. ముంబై .. ఢిల్లీ .. బీహార్ ప్రాంతాలకు అతని నుంచి కాల్స్ వెళుతున్నాయి. అతనికి ఎంతమాత్రం డౌట్ రాకుండా బార్ కి కూడా తీసుకుని వెళ్లాము. మరుసటి రోజుకి అతను ఎవరెవరితో మాట్లాడుతున్నాడనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది. దాంతో వాడికి అసలు విషయం చెప్పి అదుపులోకి తీసుకున్నాము.

అప్పుడు జాయింట్ సీపీ సార్ ని కలిసి సార్ పిక్చర్ ఇది . ఈ రోజున సినిమా రిలీజ్ .. వెంటనే ఆపరేషన్ చేయవలసి వస్తుందని చెప్పాను. ఆయన ఒక టీమ్ ను ఢిల్లీ .. మరో టీమ్ ను బీహార్ పంపించారు. మా దగ్గరికి వచ్చిన వాడిని వెంటబెట్టుకునే వెళ్లాము. డబ్బులు కలెక్ట్ చేయడం వరకే అతని పని .. నాకు కావలసింది ఆ ప్రింట్ ను ఎలా సంపాదించారు అనేది. అతణ్ణి కన్వీన్స్ చేయడం వలన కోపరేట్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఢిల్లీలో 5 గురు దొరికారు .. వాళ్ల బిజినెస్సే పైరసీ. బీహార్ లో మేము వెళ్లింది ప్రమాదకరమైన ప్రాంతం. అక్కడి పోలీసులు పైరసీ కేసును సీరియస్ గా తీసుకోలేదు.

అక్కడ అతని సెల్ ద్వారానే అందరికీ కాల్ చేయిస్తూ ఒక్కొక్కరినీ కస్టడీలోకి తీసుకుంటున్నాము. ఒక దగ్గర మా కానిస్టేబుల్ తొందరపడటం వలన మేము పోలీసులమనే విషయం తెలిసిపోయింది. దాంతో కర్రలు పట్టుకుని ఓ వందమంది వచ్చేశారు. అప్పుడు అక్కడ పోలీసులు ఆ గోల సద్దుమణిగేవరకూ మమ్మల్ని లోపల కూర్చోబెట్టారు. ఆ మరుసటి రోజు ఈ టీమ్ లీడర్ ను పట్టుకున్నాము. ఏ టెక్నాలజీ ద్వారా వాళ్ల చేతికి ప్రింట్ వెళ్లిందనేది మాకు అర్థమైపోయింది. కస్టడీలో ఉన్న వాళ్లని అక్కడి నుంచి తీసుకురావడానికి మేజిస్ట్రేట్ ను ఒప్పించవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చారు


Full View
Tags:    

Similar News