హ్యాట్సాఫ్ టు ఇళయరాజా

Update: 2016-03-28 09:15 GMT
దేశంలో ఎందరో గొప్ప సంగీత దర్శకుల్ని చూశాం. కాస్త వయసు మీద పడగానే ఉత్సాహం తగ్గిపోతుంటుంది. కాలంతో పోటీ పడలేకపోతుంటారు. ఔట్ డేట్ అయిపోతుంటారు. సంగీతంలో పదును తగ్గిపోతుంటుంది. కానీ ఇళయరాజా వాళ్లందరికీ భిన్నంగా 72 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా పని చేయడం.. ఇప్పటికీ సంగీత దర్శకుడిగా తన ప్రత్యేకత చాటుకుంటుండటం.. ఈ వయసులో జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికవడం ఆయనకే చెల్లింది. ప్రతిష్టాత్మకమైన తన 1000వ సినిమా ‘తారై తాపట్టై’కు ఆయన ఈ పురస్కారం అందుకోవడం అన్నింటికన్నా పెద్ద విశేషం. సంగీత దర్శకుడిగా వెయ్యి సినిమాలు చేసి దేశంలో వేరెవ్వరికీ సాధ్యం కాని ఘనత అందుకోవడమే విశేషమంటే.. దానికి జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకోవడమంటే మామూలు విషయమా.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బాల రూపొందించిన ‘తారై తాపట్టై’కి గాను బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ పురస్కారాన్ని అందుకోబోతున్నారు ఇళయరాజా. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇళయరాజా బ్యాగ్రౌండ్ స్కోర్ - పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆయన సంగీతంలోని గొప్పదనాన్ని నేషనల్ అవార్డ్స్ జ్యూరీ కూడా గుర్తించింది. ఇళయరాజాకు ఇది ఐదో జాతీయ అవార్డు కావడం విశేషం. ఇంతకుముందు రెండు అవార్డులు తెలుగు సినిమాలకే వచ్చాయి. 1984లో సాగరసంగమం చిత్రానికి.. 1989లో ‘రుద్రవీణ’కు ఆయన జాతీయ అవార్డులు అందుకున్నారు. తమిళంలో సింధుభైరవి (1986), మలయాళంలో పళాసి రాజా (2009) సినిమాలకు కూడా ఆయన్ని జాతీయ అవార్డులు వరించాయి.
Tags:    

Similar News