వ‌ర్మ వల్ల టీవీ షోలో వివాదం..ఏకంగా లైవ్ బంద్

Update: 2019-04-22 13:53 GMT
వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిగా పేరొంది - సంచలనాల‌కు సుప‌రిచితుడు అయిన డైరెక్ట‌ర్ రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా స‌ష్టిస్తున్న క‌ల‌క‌లం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై బ‌యోపిక్‌  తీయడం. త‌న సినిమా నిర్మాణంలో భాగంగా - ఇప్ప‌టికే టైటిల్‌ ను ఖ‌రారు చేసి పాట‌ను పాడుతూ వీడియో కూడా విడుదల చేసిన వ‌ర్మ ఈ క్ర‌మంలో ఆంధ్రోడా అంటూ  పరుష పదాలను వాడారు. ఇలా సినిమాకు ముందే వ‌ర్మ సృష్టించిన వివాదాల ఫ‌లితంగా...ఓ టీవీ డిస్క‌ష‌న్‌ లో వివాదం రేగింది. ఏకంగా లైవ్ ఆపేయాల్సి వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెళితే - టైగ‌ర్ కేసీఆర్‌ బ‌యోపిక్‌ పై ఓ టీవీ ఛాన‌ల్‌ లో చ‌ర్చ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ త‌రఫున ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి ఇందిరా శోభ‌న్‌ - టీఆర్ ఎస్ త‌ర‌ఫున టీఎస్‌ టీఎస్ చైర్మ‌న్ రాకేశ్ చిరుమిల్ల పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా కాంగ్రెస్ నేత మాట్లాడుతూ - కేసీఆర్ బ‌యోపిక్ అంటే ఆయ‌న జీవితంలో అన్ని అంశాలు చూపించాల‌ని..గ‌తంలో ఆయ‌న్ను దుబాయ్ శేఖ‌ర్ - ముంబై శేఖ‌ర్‌ అని పిలిచే వారంటూ... వ‌ర్మ బ‌యోపిక్‌ లో ఇవ‌న్నీ కూడా ఉంటాయా? అనే సందేహం వ్య‌క్తం చేశారు. దీంతో ఆమెపై రాకేష్ విరుచుకుప‌డ్డారు. అభిప్రాయం తెల‌ప‌డ‌మే త‌ప్ప‌న‌ట్లుగా...ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ ఉద్య‌మ కాలం నాటి విష‌యాల‌ను కాకుండా వ్య‌క్తిగ‌త అంశాలు ఎందుకు ప్ర‌స్తావించడం అంటూ రాకేష్ మండిప‌డ్డారు. కేసీఆర్‌ ను దుబాయ్ శేఖ‌ర్ అంటార‌ని మీ అమ్మ చెప్పిందా?  మీ అయ్య చెప్పాడా...అంటూ తీవ్ర‌ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అవాక్క‌వ‌డం ఇందిర స‌హా స‌ద‌రు టీవీ యాంక‌ర్ వంతు అయింది. టీవీ చ‌ర్చ దారిత‌ప్ప‌డం - మ‌హిళ నేత‌పై ఆయ‌న స్పందించిన విధానానికి ప్ర‌తిస్పంద‌న‌గా జ‌రిగిన వాగ్వాదంను స‌ద్దుమ‌ణిగించేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, వారి వివాదం ముగియక‌పోవ‌డంతో చ‌ర్చ‌ను వాయిదా వేయాల్సి వ‌చ్చింది.

కాగా, తాజా చ‌ర్చ‌లో స‌ద‌రు నేత వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్ల ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. బ‌యోపిక్ అంటే స‌మ‌స్త అంశాల స‌మాహార‌మే కదా...అనే సందేహానికి ఇలాంటి అసంబ‌ద్ద వ్యాఖ్య‌లు ఏమిట‌ని మండిప‌డుతున్నారు. మ‌రోవైపు టీవీ చ‌ర్చ‌ల్లో ఇటీవ‌ల పెరుగుతున్న నియంత్ర‌ణ కోల్పోతున్న ఉదంతాల‌కు ఇది తార్కాణామ‌ని చ‌ర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News