'వారీసు' వివాదంపై టీఎఫ్ పీసీ వివ‌ర‌ణ‌!

Update: 2022-11-21 11:30 GMT
త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'వారీసు'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. త‌మిళంలో 'వారీసు'గా, తెలుగులో 'వార‌సుడు'గా వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.  ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని ఈ సంక్రాంతికి త‌మిళ, తెలుగు భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమా చుట్టూ గ‌త కొన్ని రోజులుగా రిలీజ్ వివాదం న‌డుస్తోంది.

పండ‌గ సీజ‌న్ ల‌లో తెలుగు సినిమాల‌కు అధిక ప్రాధాన్య‌త నివ్వాల‌ని, డ‌బ్బింగ్ సినిమాల‌కు ప్ర‌ధాన్య‌త ఇవ్వ‌రాదంటూ ఇటీవ‌ల నిర్మాత మండలి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల అల్లు అర‌వింద్ డ‌బ్బింగ్ సినిమాల రిలీజ్ అని ఆప‌డం కుద‌ర‌ని ప‌ని అని, సినిమా ఇప్ప‌డు దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందుతోంద‌ని, ఏ భాష సినిమా అయినా ప్రేక్ష‌కుల్ని చేరుకుంటోంద‌ని, ఈ ద‌శ‌లో అనువాద చిత్రాల‌ని రిలీజ్ ల‌ని ఆపాల‌నుకోవ‌డం మంచి చ‌ర్య కాద‌న్నారు.

తాజాగా ఈ వివాదంపై స్పందించిన త‌మిళ దర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి టాలీవుడ్ మేక‌ర్స్ ని హెచ్చిరంచాడు. 'వారీసు' రిలీజ్ కు అడ్డంకులు సృష్టిస్తే త‌మిళ‌నాడులో తెలుగు సినిమాల‌కు అడ్డంకులు సృష్టిస్తామంటూ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినంత‌ప‌ని చేశాడు. తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి ప‌ద్ద‌తి త‌న‌కు ఏమీ న‌చ్చ‌లేద‌న్నారు. ఒక వేళ వారు ప్ర‌క‌టించిన విధంగానే జ‌రిగితే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని హెచ్చ‌రించారు.

తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి తీసుకున్న నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌స్తే 'వారీసు'కు ముందు.. 'వారీసు' త‌రువాత సినిమా అనే స్థాయిలో ప‌రిస్థితులు మార‌తాయ‌న్నాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా టీఎఫ్ పీసీ సెక్ర‌ట‌రీ ప్ర‌స‌న్న‌కుమార్ స్పందించారు. '2023 సంక్రాంతి రిలీజ్ ల విష‌యంలో తొలి ప్రాధాన్యం తెలుగు సినిమాల‌కు ఇవ్వాలంటూ తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి ఓ ప్ర‌క‌ట‌న‌ని విడుద‌ల చేసింది. మొద‌టి ప్రాధాన్యత‌ తెలుగు సినిమాల‌కు ఇవ్వాల‌ని.. మిగిలిన థియేట‌ర్స్ ని డ‌బ్బింగ్ సినిమాల‌కు ఇవ్వాల‌ని దాని సారాంశం.

అంతే కానీ డ‌బ్బింగ్ సినిమాల‌ని తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ చేయాల‌ని కానీ, డ‌బ్బింగ్ సినిమాల‌ని తెలుగు రాష్ట్రాల్లో ఆడ‌నివ్వ‌మ‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో ఎక్క‌డా లేదు. మేము ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత ప్రేక్ష‌కుల‌ని ఎమోష‌న్ కు గురిచేసేలా కొంత మంది మాట్లాడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో త‌మ సినిమాల‌ని ఆడ‌నివ్వ‌క‌పోతే.. తెలుగు సినిమాల‌ను అక్క‌డ రిలీజ్ కాన‌వ్వ‌బోమ‌ని అన‌డం అర్థ‌ర‌హితం. సినిమా అనేది అంద‌రికి సంబంధించింది. 'లీవ్ అండ్ లెట్ లీవ్' అనే విష‌యాన్ని అంతా గ్ర‌హించాలి' అంటూ లింగుస్వామి వ్యాఖ్య‌ల‌కు చుర‌క‌లంటించారు.
 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News