సల్మాన్ మూవీలో జగ్గూ భాయ్ పవర్ఫుల్ రోల్!

Update: 2022-05-26 15:30 GMT
జగపతిబాబు .. కొంతకాలం క్రితం వరకూ ఆయన ఓ స్టార్ హీరో. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తీయాలనుకునేవారు ముందుగా ఆయన పేరునే పరిశీలించేవారు. ఆ తరువాత అవకాశాల కోసం ఎదురుచూస్తూ హాల్లో కూర్చున్న రోజులు చాలానే ఉన్నాయని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలోనే ఆయన విలన్ వేషాలు వేయడానికి సిద్ధపడాలని నిర్ణయించుకున్నారు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ కి వారసుడు .. కొంతకాలం పాటు తెరపై వెలిగిన స్టార్ హీరో. ఒక్కసారిగా విలన్ వేషాల వైపు వెళ్లాలంటే అది సలహా ఇచ్చినంత తేలిక కాదు.

అయినా ఎవరేమనుకుంటే నాకెందుకు? అన్నట్టుగానే జగపతిబాబు ముందుకు వెళ్లారు. 'లెజెండ్' సినిమాతో విలన్ గా మారిన ఆయన, ఇక ఇక్కడ పరభాషా విలన్స్ అవసరం లేదని నిర్మాతలు అనుకునేలా చేశారు.

మరో వైపున హీరోకి తండ్రిగా .. హీరోయిన్ కి తండ్రిగా కూడా ఫ్యామిలీ టైపు పాత్రల్లోను బిజీ అయ్యారు. తెలుగులో పవర్ఫుల్ విలన్ గా పేరు తెచ్చుకున్న ఆయన, అంతకుముందు హీరోగా చేసినప్పటికంటే ఎక్కువ పేరును సంపాదించుకున్నారు. అంతకంటే ఎక్కువ పారితోషికం అందుకుంటున్నారు.

గ్రామీణస్థాయి విలనిజమైనా .. కార్పొరేట్ స్థాయి విలనిజమైనా జగపతిబాబు తరువాతనే అనుకునేలా ఆయన విజృంభించారు. తమిళ .. మలయాళ .. కన్నడ  సినిమాల్లోను ప్రతినాయకుడి పాత్రల్లో బిజీ అయ్యారు.

అలాంటి జగపతిబాబు తొలిసారిగా ఒక హిందీ సినిమాలో చేస్తున్నారు .. ఆ సినిమా పేరే 'కభీ ఈద్ కభీ దివాళీ'. సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్లో ఆయన హీరోగా రూపొందనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయికగా అలరించనుంది. ఫర్హాద్ సంజీ  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగు త్వరలోనే హైదరాబాదులో మొదలుకానుంది.

ఈ సినిమాలో వెంకటేశ్ ఒక కీలకమైన  పాత్రను చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. సల్మాన్ కీ .. వెంకటేశ్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన సల్మాన్ ఆ పాత్రకి వెంకటేశ్  ను ఆఫర్  చేసినట్టుగా   చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు మరో కీలకమైన పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్నట్టుగా చెబుతున్నారు. గతంలో జగ్గూ భాయ్ కి సల్మాన్ తో చేసే ఛాన్స్ వచ్చినప్పటికీ అనుకోకుండా అది చేజారిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో జగపతికి కూడా స్థానం దక్కింది. ఈ సినిమాలో ఆయనను ఎలా చూపించనున్నారనేది చూడాలి.
Tags:    

Similar News