జయసింహా.. రూలర్‌.. ఈసారి ఏంటో?

Update: 2020-12-10 01:30 GMT
నందమూరి బాలకృష్ణ సినిమాల ఎంపిక విషయం కొన్ని సార్లు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన చేసిన కొన్ని సినిమాలను చూస్తే బాలకృష్ణ ఇంత పెద్ద స్టార్‌ అయ్యి ఉండి.. ఇంత సీనియర్‌ స్టార్‌ అయ్యి ఉండి ఎలా ఇలాంటి సినిమాలను చేశారు అంటూ అభిమానులు సైతం అనుకుంటూ ఉంటారు. ఆయన కొందరు చెప్పే మాటలు విని కథ కూడా వినకుండా సినిమాను చేస్తాడు అనే పుకార్లు ఉన్నాయి. అలా కొన్ని సినిమాలు చేయడం వల్ల ఆయన కెరీర్‌ లో దారుణమైన ప్లాప్‌ లు గా నమోదు అయ్యాయి.

ఆ సినిమాల సంగతి పక్కన పెడితే బాలకృష్ణ కెరీర్‌ లో తీవ్రంగా నిరాశ పర్చిన సినిమాలుగా జయసింహా మరియు రూలర్‌ లు నిలుస్తాయి. ఈ రెండు సినిమాలను కూడా సి కళ్యాణ్‌ తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో నిర్మించాడు. ఇప్పుడు వీరి కాంబోలో మూడవ సినిమాకు రంగం సిద్దం అవుతుందట.

బాలకృష్ణ హీరోగా మరో సినిమాను నిర్మిస్తాను అంటూ సి కళ్యాన్‌ ఇటీవల ఒకానొక సందర్బంగా ప్రకటించాడు. ఆ సినిమా ఎప్పుడు ఉండేది త్వరలోనే ప్రకటిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన విషయమై మరో పుకారు షికారు చేస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమాకు కూడా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించబోతున్నాడు అంటున్నారు. ఇప్పటికే రెండు ప్లాప్‌ లు పడ్డా కూడా మళ్లీ నమ్మకంతో బాలయ్య వీరిద్దరికి అవకాశం ఇస్తున్నాడని అంటున్నారు.

తమిళంలో ఎన్నో సూపర్‌ హిట్‌ లను అందించిన కేఎస్‌ రవికుమార్‌ ను బాలయ్య గుడ్డిగా నమ్మేస్తున్నాడా అనే చర్చ కూడా అభిమానుల్లో నడుస్తోంది. ప్రస్తుతం బోయపాటితో సినిమా చేస్తున్న బాలయ్య తదుపరి సినిమా ఎవరితో అనే విషయంలో క్లారిటీ రాలేదు. కొత్త సినిమాకు మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని నందమూరి ఫ్యామిలీ నుండి సమాచారం అందుతోంది.


Tags:    

Similar News