కంగనకు అవార్డ్.. అతడికి పంచ్

Update: 2016-03-28 08:50 GMT
జాతీయ అవార్డు ఒక్కసారి గెలిస్తేనే జన్మ ధన్యమైపోతుంది. అలాంటిది ఒక నటి ఒకటికి మూడుసార్లు ఈ పురస్కారానికి ఎంపికవడమంటే మామూలు విషయం కాదు. అది కూడా ఎనిమిదేళ్ల వ్యవధిలో మూడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకోవడం అద్భుతమైన విషయం. ఈ అరుదైన ఘనత కంగనా రనౌత్ కే సొంతమైంది. కెరీర్ ఆరంభంలో కంగనా వేసిన గ్లామర్ వేషాలు చూసి.. ఆమె ఇలా అవార్డులు కొల్లగొడుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఐతే ‘ఫ్యాషన్’ సినిమాలో రోడ్డు మీద అడుక్కుతినే స్థాయికి చేరిన ఓ నిజ జీవిత మోడల్ పాత్రకు ప్రాణం పోసిన కంగనా తొలి జాతీయ అవార్డును కొల్లగొట్టింది. ఆ చిత్రానికి గాను ఆమెకు జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు దక్కింది.

ఇక రెండేళ్ల కిందట ‘క్వీన్’ సినిమాలో కంగనా అసమాన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. రేపు పెళ్లనగా ఈ రోజు పెళ్లి కొడుకు నో చెబితే.. ఇంతకుముందు ప్లాన్ చేసుకున్న ప్రకారమే యూరోప్ హనీమూన్ కు ఒంటరిగా బయల్దేరి వెళ్లే అమ్మాయి కథ ఇది. ఆ ప్రయాణంలో తన జీవితాన్ని సరికొత్తగా ఆవిష్కరించుకునే పాత్రలో అద్భుతంగా నటించి.. ఈసారి జాతీయ ఉత్తమ హీరోయిన్ గానే ఎంపికైంది కంగనా. గత ఏడాది ‘తను వెడ్స్ మను’తో మరోసారి ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి వరుసగా రెండో ఏడాది కూడా జాతీయ అవార్డు కొల్లగొట్టి.. మరెవరికీ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది కంగనా. స్టార్ హీరో హృతిక్ రోషన్ తో తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం కొనసాగుతున్న టైంలో ఈ అవార్డు అందుకోవడం ఆమెకు నైతిక బలాన్నిచ్చేదే. ఒకరకంగా హృతిక్ కు ఇది గట్టి పంచ్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు ‘కోయీ మిల్ గయా’ సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని చాలా ఆశ పడి నిరాశ చెందాడు హృతిక్. ఇప్పుడు తన శత్రువు ఏకంగా మూడో జాతీయ అవార్డు అందుకోవడం అతడికి మంట పుట్టించేదే.
Tags:    

Similar News