మెగా డాటర్.. హ్యాట్రిక్ కొట్టేసింది

Update: 2018-07-31 10:00 GMT
పాపం కొణిదెల నిహారిక.. ఇంట్లో వాళ్లతో పోరాడి.. అందరినీ ఒప్పించి.. అతి కష్టం మీద కథానాయిక అవతారం ఎత్తింది. కానీ ఆమెకు ఇక్కడ అదృష్టం కలిసి రాలేదు. మూడేళ్ల వ్యవధిలో మూడు సినిమాలు చేస్తూ ఆ మూడూ ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. నిహారిక తొలి సినిమా ‘ఒక మనసు’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. ఆ సినిమాకు మంచి బజ్ వచ్చినా ఫలితం లేకపోయింది. పేలవమైన టాక్ తో మొదలై.. వీకెండ్ అయ్యేసరికి అడ్రస్ లేకుండా పోయిందా సినిమా. ఈ దెబ్బతో తెలుగులో వెంటనే మరో సినిమా చేసే సాహసం చేయని నిహారిక.. కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ విజయ్ సేతుపతి లాంటి క్రేజీ హీరోతో కలిసి ‘ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్’ అనే డార్క్ కామెడీ మూవీలో నటించింది. ఆ చిత్రమూ ఫ్లాపే అయింది.

కట్ చేస్తే తిరిగి టాలీవుడ్ కు వచ్చి ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా చేసింది. లక్ష్మణ్ కార్య అనే యువ దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమా చేసిన నిహారిక ఇది కచ్చితంగా తనకు తొలి విజయాన్నందిస్తుందని నమ్మింది. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్ ఈ చిత్రాన్ని టేకప్ చేయడంతో ఆమె నమ్మకం మరింత పెరిగింది. కానీ ఈ సినిమా కూడా నిహారికకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. చిన్న పాయింట్ పట్టుకుని బాగా సాగతీతగా చెప్పడంతో ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు రుచించలేదు. దీనికి ప్రి రిలీజ్ బజ్ లేదు. ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రం. వీకెండ్ తర్వాత అసలు సినిమా నిలిచే పరిస్థితి లేదు. మొత్తానికి నిహారిక ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టేసింది. ఈ స్థితిలో ఆమెకు తర్వాత అవకాశం ఎవరిస్తారో.. ఆమె ఎలాంటి సినిమాను ఎంచుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News