కృష్ణ కుమారి ఇక లేరు

Update: 2018-01-24 06:35 GMT
తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్ అండ్ వైట్ కాలంలో అందంతో పాటు నటనా ప్రతిభతో ఆకట్టుకుని ప్రేక్షకుల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటీమణులలో కృష్ణ కుమారి గారు ఒకరు. 60వ దశకంలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరొయిన్ గా నటించిన ఆవిడకు సావిత్రితో పోటీ పడేంత అభిమానులు ఉండేవారు అంటే అతిశయోక్తి కాదు. సుమారు 110 సినిమాల్లో నటించిన కృష్ణ కుమారి గారు రాసి కంటే వాసికే ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే ఆవిడకు అంత పేరు వచ్చింది. ఈ రోజు తీవ్ర అస్వస్థతతో బెంగళూరులోని తన స్వగృహంలో చివరి శ్వాస విడిచే నాటికి ఆవిడ వయసు 85. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కృష్ణ కుమారి గారు 1933  మార్చ్ 6న జన్మించారు.1951లో పాతాళ భైరవి సినిమాలో చిన్న వేషం ద్వారా తెరంగేట్రం చేసి నవ్వితే నవరత్నాలు సినిమాతో హీరొయిన్ గా మారారు. అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా అడుగులు వేసారు.

బెంగుళూరుకు చెందిన అజయ్ మోహన్ ను వివాహం చేసుకున్నాక సినిమాలు తగ్గించుకున్న కృష్ణ కుమారి పెళ్లి చేసుకున్నాక పూర్తిగా కుటుంబ జీవితానికే అంకితమయ్యారు. దీప ఈవిడ ఏకైక సంతానం. 1969 నుంచే సినిమాలు మానేసిన కృష్ణ కుమారి గారు ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో అతిధి పాత్రలు పోషించినప్పటికీ నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపలేదు. కాంచన తరహాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన చేసారు కాని ఆరోగ్యం సహకరించక ఆ ఆలోచన మానుకున్నారు. ప్రముఖ నటీమణి షావుకారు జానకి ఈవిడకు స్వయానా అక్కయ్య. ఎన్టీఆర్ - ఎఎన్ ఆర్ - జగ్గయ్య - ఎస్విఆర్ - కాంతారావు లాంటి దిగ్గజాలతో మరపురాని ఎన్నో సినిమాలు ఆవిడ చేసారు.

చిక్కడు దొరకడు - పిచ్చి పుల్లయ్య - అంతస్తులు - డాక్టర్ చక్రవర్తి - కుల గోత్రాలు - గుడి గంటలు లాంటి మరపురాని ఆణిముత్యాలు కృష్ణ కుమారి గారి కీర్తి కిరీటంలో ఉన్నాయి. ఇలాంటి గొప్ప నటి వదిలి వెళ్ళిపోవడం పట్ల టాలీవుడ్ తో పాటు తమిళ - మలయాళ - హింది బాషా సినీ పరిశ్రమల నుంచి కూడా విచారం వ్యక్తం అవుతోంది. ఆయా బాషలలో కూడా కృష్ణ కుమారి గారు కొన్ని సినిమాలు చేసారు. 
Tags:    

Similar News