ఆ హీరోయిన్ చీరలను ఇస్త్రీ చేసిన ఆ వ్యక్తి నేటి టాప్ డైరెక్టర్!

Update: 2022-03-17 23:30 GMT
ముంబైలోని స్టార్ డైరెక్టర్స్ లో రోహిత్ శెట్టి ఒకరు. ఆడుతూ పాడుతూ ఇండస్ట్రీకి వచ్చి ఆయన దర్శకుడు కాలేదు. ఎన్నో కష్టాలు .. ఎన్నో అవమానాలు .. ఎన్నో వైఫల్యాలు చూస్తూ ఆయన ఈ రోజున ఈ స్థాయికి చేరుకున్నాడు. రోహిత్ శెట్టి తన తొలి పారితోషికంగా 35 రూపాయలు అందుకున్నాడంటే .. టబు చీరలను ఐరన్ చేసేవాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆయన అంత తక్కువ పనులను చేశాడా అనేది కాదు ఇక్కడ చూడవలసింది. అక్కడి నుంచి ఏ స్థాయికి ఎలా ఎదిగాడనేది ఆలోచన చేయవలసింది .. ఆదర్శంగా తీసుకోవలసింది.

రోహిత్ శెట్టికి మొదటి నుంచి కూడా సినిమాలంటే ఇష్టం .. సినిమాల కోసం ఎంతకష్టమైనా పడటమంటే ఇష్టం. అందువల్లనే ఆయన తన 17వ ఏట 'ఫూల్ ఔర్ కాంటే' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అజయ్ దేవగణ్ హీరోగా చేసిన ఆ సినిమా ఏ స్థాయి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే.

అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఆయన తొలి పారితోషికంగా 35 రూపాయలను అందుకున్నాడు. ఒకానొక సందర్భంలో 'టబు' చీరలను ఇస్త్రీ చేశాడు. ముంబై మహానగరంలో ఎలాంటి ఆధారం లేకుండా బ్రతకడమంటే, ఏ రోజుకు ఆ రోజు చచ్చిపోయి పుట్టడం లాంటింది.

అలాంటి ముంబైలో తనకున్న క్రియేటివిటీని ఉపయోగించుకుని అంచలంచెలుగా  ఎదుగుతూ వెళ్లాడు. దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. ముంబైలోని టాప్ డైరెక్టర్స్ జాబితాలో తన పేరు ఉండేలా చూసుకున్నాడు. పోయిన ఏడాది నవంబర్లో ఆయన నుంచి వచ్చిన 'సూర్యవంశీ' అనూహ్యమైన విజయాన్ని సాధించింది. అక్షయ్ కుమార్ - కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమా వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టించింది. అంతకంటే భారీ సినిమా చేయడానికి అవసరమైన శక్తిసామర్థ్యాలను ఆయనకి ఇచ్చింది.

సమయాన్ని ఎంతమాత్రం వెస్ట్ చేయకపోవడం రోహిత్ శెట్టి దగ్గరున్న ప్రత్యేకమైన లక్షణమని ఆయన సన్నిహితులు చెబుతారు. స్క్రిప్ట్ పరమైన వర్క్ తో .. హోస్ట్ గా చేసే కార్యక్రమాలకి సంబంధించిన వ్యవహారాలతో .. యాడ్స్ చేయడంలోను ఆయన బిజీగా ఉంటాడు. అందువలన ఆయన ఏడాదికి 35 నుంచి 45 కోట్ల వరకూ సంపాదిస్తాడని చెబుతారు.

ఒక్కో సినిమాకి దర్శకత్వం చేసినందుకు గాను 25 కోట్లు తీసుకుంటాడని అంటున్నారు. ఆయన స్థిరాస్తుల విలువ 280 కోట్లకి పైగా ఉంటుందని చెబుతున్నారు. ఇంత తెలుసుకున్న తరువాత ఆయన గ్రేట్ అని చెప్పకుండా ఎలా ఉంటాం చెప్పండి!
Tags:    

Similar News