'మా' చిన్నబుద్ధి మరోసారి బయటపడిందిగా?

Update: 2019-12-16 11:47 GMT
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. పొట్టిగా ‘‘మా’’ పేరుతో పిలిచే అసోసియేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్టిస్టుల సంక్షేమం కోసమే తాము పుట్టినట్లుగా స్పీచులు ఇచ్చే మా సభ్యులు.. ఎన్నికలకు ముందు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. మా అధ్యక్ష.. కార్యదర్శి కుర్చీల కోసం వారు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. ఒకసారి పదవిలోకి వచ్చాక.. మళ్లీ ఎన్నికల వరకూ చప్పుడు చేస్తే ఒట్టు అన్నట్లు వ్యవహరిస్తారు.

ప్రముఖ నటుడు కమ్ రచయిత..సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు మరణించిన వేళ.. తెలుగు ప్రజలంతా అయ్యో.. అలాంటి వ్యక్తి మన మధ్య నుంచి వెళ్లిపోయాడే అన్న బాధకు గురయ్యారు. తెలుగు ప్రజలు పడిన బాధలో మూవీ ఆర్టిస్టులు ఎంత పడ్డారన్నది క్వశ్చనే. దానికి బలం చేకూరేలా మా అసోసియేషన్ నుంచి ఒక్కరంటే ఒక్క సభ్యుడు సైతం గొల్లపూడికి వీడ్కోలు పలికేందుకు.. ఆయనకు నివాళులు అర్పించేందుకు చెన్నైకి రాకపోవటం చూస్తే.. వారి మాటలకు.. చేతలకు మధ్యనున్న తేడా ఇట్టే అర్థం కాక మానదు.

సినీ రంగంలో సుదీర్ఘ కాలం సేవలు అందించిన సీనియర్ నటుడికి కడసారి వీడ్కోలు పలికేంత పెద్ద మనసు లేని తీరు చూస్తే.. మా వారి తీరు ఎప్పటికి మారదా? అనిపించక మానదు. గొల్లపూడి మీద అభిమానంతో పలువురు సాహితీవేత్తలు.. మరికొందరు ప్రముఖులు వ్యక్తిగతంగా చెన్నైకి వెళ్లి మరీ నివాళులు అర్పించి వస్తే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున వెళ్లకపోవటానికి మించిన దుర్మార్గం ఇంకేం ఉంటుందన్న ఆగ్రహం కలుగక మానదు.

ఇవాళ కాకుంటే రేపు.. కాదంటే ఏదో ఒక రోజు అందరూ సెలవు తీసుకోవాల్సిందే. ఇప్పటివరకూ మనతో ఉన్న వ్యక్తి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వేళ.. అంతిమ సంస్కారాలకు హాజరు కావటానికి మించిన సంస్కారం ఇంకేం ఉంటుంది. తమకు అలాంటివి కూడా తక్కువేనన్న విషయాన్ని ‘‘మా’’ సభ్యులు చెప్పేశారని చెప్పాలి.  సీనియర్ నటులకే నివాళులు అర్పించటం రాని మా.. ఇంకెవరి కోసం? అన్న క్వశ్చన్ కు సమాధానం చెబితే బాగుంటుంది.
Tags:    

Similar News