మూవీ రివ్యూ : మరక్కార్

Update: 2021-12-03 11:31 GMT
చిత్రం : 'మరక్కార్’

నటీనటులు: మోహన్ లాల్-అర్జున్-ప్రభు-కీర్తి సురేష్-ప్రణవ్ మోహన్ లాల్-సుహాసిని-మంజు వారియర్-సునీల్ శెట్టి-సిద్దిఖ్-అశోక్ సెల్వన్ తదితరులు
సంగీతం: రోనీ రాఫెల్-రాహుల్ రాజ్-అంకిత్ సూరి-లైయల్ ఎవాన్స్
ఛాయాగ్రహణం: తిరు
నిర్మాత: ఆంటోనీ పెరుంబవూర్
రచన-దర్శకత్వం: ప్రియదర్శన్

మలయాళ బాహుబలిగా భారీ అంచనాలు తెచ్చుకున్న సినిమా ‘మరక్కార్’. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ రూపొందించాడు. తెలుగులో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అహ్మద్ అలీ అలియాస్ కుంజాలి మరక్కార్ (మోహన్ లాల్) 16వ శతాబ్దంలో వ్యాపారం పేరుతో భారత దేశంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న పోర్చుగీసులపై పోరాడిన వీరుల కుటుంబానికి చెందిన వాడు. ఐతే పోర్చుగీసు వారు చేసిన దాడిలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన కుంజాలి.. ఆ తర్వాత ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని గజదొంగగా మారి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్న సముద్రీకుల నుంచి డబ్బు, ధాన్యం లాంటివి కొల్లగొట్టి ప్రజలకు అందిస్తుంటాడు. దీంతో అతణ్ని ప్రజలు దేవుళ్లలాగా కొలుస్తుంటారు. కుంజాలిని ఎలా అదుపు చేయాలా అని తలపట్టుకుంటున్న సమయంలోనే పోర్చుగీసు సైన్యం తమ రాజ్యంపై దండెత్తబోతున్నారని తెలుస్తుంది.

దీంతో సముద్రంలో యుద్ధ నైపుణ్యాలు తెలిసిన కుంజాలినే సముద్రీకులు ఆశ్రయిస్తారు. అతనే వీరి నావికాధిపతిగా మారి యుద్ధంలో గెలిపిస్తాడు. ఐతే అంతా బాగుందనుకున్న సమయంలో ఒక కుట్ర కారణంగా కుంజాలి పై రాజ ద్రోహం ముద్ర పడుతుంది. కుంజాలి అంటే గిట్టని వాళ్లు రాజ్యాధికారం చేజిక్కించుకుని పోర్చుగీసు వారితో కలిసి కుంజాలి మీదికి దండెత్తి వస్తారు. ఆ స్థితిలో కుంజాలి తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి ఎలా పోరాడాడు.. చివరికి ఏం జరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

మన రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా.. దేశవ్యాప్తంగా ఫిలిం మేకర్స్ ఆలోచనా తీరునే మార్చేసింది. హాలీవుడ్ స్థాయిలో మనమూ భారీ కథలను ఎంచుకుని వందల కోట్ల ఖర్చుతో సినిమా తీయొచ్చని.. ఆ స్థాయిలో భారీతనం చూపించవచ్చని.. భాషా భేదం లేకుండా అందరినీ ఆకట్టుకోవచ్చని కొత్త ఆశలు కల్పించిన సినిమా ‘బాహుబలి’. కానీ ఇది సానుకూల విషయమే కానీ.. ఇలాంటి ఆలోచనలతో తెరకెక్కిన భారీ సినిమాలకు ‘బాహుబలి’ వల్ల కలిగే నష్టం కూడా ఇంకోటుంది. ఆ తరహా చిత్రాలన్నింటినీ ఆటోమేటిగ్గా ప్రేక్షకులు ‘బాహుబలి’తో పోల్చి చూస్తారు. ఆ స్థాయి భారీతనం.. భావోద్వేగాలు.. రోమాంచిత సన్నివేశాలు.. విజువల్ గ్రాండియర్ ఆశిస్తారు.

దానికి ఏమాత్రం తగ్గినా నిరాశ చెందుతారు. ఇలా ‘బాహుబలి’ స్ఫూర్తితో తెరకెక్కి బోల్తా కొట్టిన భారీ చిత్రాల జాబితా పెద్దదే. ఇప్పుడు ‘మరక్కార్’ సైతం అందుకు మినహాయింపు కాదు. టీజర్.. ట్రైలర్లలో చూస్తే ‘బాహుబలి’కి దీటైన చిత్రంలా కనిపించిన ‘మరక్కార్’.. సినిమాగా ఆ స్థాయికి చాలా దూరంలో ఆగిపోయింది. విజువల్‌గా కొన్ని చోట్ల వావ్ అనిపించినా.. బలమైన కథ.. ఆసక్తికర కథనం.. ప్రేక్షకులను కదిలించే భావోద్వేగాలు లేక ఈ సినిమా నిరాశకే గురి చేస్తుంది.

‘మరక్కార్’ కల్పిత కథేమీ కాదు. కేరళ ప్రాంతంలో 16వ శతాబ్దంలో నిజంగానే ఉన్న కుంజాలి మరక్కార్ అనే యోధుడి కథనే సినిమాగా తెరకెక్కించాడు ప్రియదర్శన్. ఐతే వాస్తవ కథను ఎగ్జాజరేట్ చేసి చూపించినా ఈ తరహా సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే వీరోచిత దృశ్యాలు.. భారీతనం ఇందులో కనిపించలేదు. కల్పిత కథ అయినా.. వాస్తవ ఘటనల నుంచి అల్లుకున్న కథ అయినా.. తనదైన శైలిలో హీరో పాత్రను వీరోచితంగా చూపించి.. ప్రేక్షకుల్లో ఉద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లడంలో రాజమౌళి ప్రతిభే వేరు. ఆయన ఆలోచనలకు తగ్గట్లుగా కథాకథనాల్ని కూడా బలంగా తీర్చిదిద్దుకుంటాడు.

సగటు ప్రేక్షకుల స్థాయికి దిగి కమర్షియాలిటీ ఏమాత్రం మిస్ కాకుండా యాక్షన్ బ్లాక్స్.. హఈరో ఎలివేషన్లు ఉండేలా చూసుకుంటాడు రాజమౌళి. ‘మరక్కార్’లో అవే మిస్సయ్యాయి. ప్రియదర్శన్ ఎంత గొప్ప దర్శకుడు అయినా సరే.. ఈ తరహా సినిమాల నుంచి ఆశించే భారీతనం.. యాక్షన్ ఘట్టాలను అందించడంలో విఫలమయ్యాడు. ఇంటర్వెల్ ముంగిట సముద్రం నేపథ్యంలో వచ్చే యుద్ధ సన్నివేశం మినహాయిస్తే ప్రేక్షకులను పెద్దగా రంజింపజేసే సన్నివేశాలే ఇందులో లేవు. పతాక సన్నివేశం సైతం అనుకున్నంత ఎగ్జైటింగ్‌ గా లేదు.

ఈ రెండు ఘట్టాల వరకు కొంత భారీతనం అయినా కనిపిస్తుంది కానీ.. మధ్యలో నడిచేదంతా మామూలు వ్యవహారమే. హీరో నేపథ్యం.. అతను రాబిన్ హుడ్ లాగా మారి దొరల్ని కొట్టి దొంగలకు పంచిపెట్టే ఎపిసోడ్ అంతా చాలా సాధారణంగా అనిపిస్తుంది. అందులోనూ కేరళ ప్రాంత చరిత్ర చుట్టూ కథను నడపడంతో మన వాళ్లు దీంతో కనెక్ట్ కావడం కూడా కష్టమవుతుంది.

మోహన్ లాల్ కు బందిపోటుగా హెవీ గెటప్ వేయడం.. ఉద్వేగ భరిత సన్నివేశాలు పెద్దగా లేకపోవడంతో ఆయన్నుంచి గొప్ప పెర్ఫామెన్స్ కూడా ఆశించడానికి వీల్లేకపోయింది. ఆ రకంంగా తీవ్ర నిరాశ తప్పదు. ప్రథమార్ధంలో అయినా సముద్రం మీద జరిగే యుద్ధ ఘట్టం కొంత వరకు ప్రేక్షకులను ఎంగజ్ చేస్తుంది కానీ.. సెకండాఫ్ లో కథను మలుపు తిప్పే కీర్తి సురేష్ పాత్ర తాలూకు ఎపిసోడ్ అయితే ‘మరక్కార్’ను సగటు సినిమా స్థాయికి తీసుకొచ్చేస్తుంది. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎమోషనల్ గా ఏమాత్రం కదిలించలేకపోయింది. హీరో రాజద్రోహిగా మారడం.. ఆ తర్వాత పరిస్థితులు యుద్ధానికి దారితీయడం..

ఇదంతా మొక్కుబడిగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో అనుకున్నంత భారీతనం లేకపోవడం.. ఎమోషనల్ కనెక్ట్ అన్నదే లేకపోవడంతో ‘మరక్కార్’ చివరికొచ్చేసరికి మరింత పడిపోతుంది. తమ చరిత్రలో ఉన్న ఒక యోధుడి గురించి తీసిన సినిమా కావడంతో మలయాళీలు కొంత మేర ఈ కథతో కనెక్ట్ కావచ్చేమో కానీ.. భాషతో సంబంధం లేకుండా అందరూ కనెక్ట్ అయ్యే ‘బాహుబలి’ తరహా సినిమా ‘మరక్కార్’ ఎంతమాత్రం కాదు. ఇటు మలయాళ సినిమాల శైలికి తగ్గ క్లాసిక్ లానూ లేదు.. అలా అని మన ప్రేక్షకులు కోరుకున్న కమర్షియల్ అంశాలు కూడా మిస్ కావడంతో ‘మరక్కార్’ నిరాశనే మిగులుస్తుంది.

నటీనటులు:

మోహన్ లాల్ కు ఏ పాత్ర ఇచ్చినా దాన్ని అద్భుతంగా పండిస్తాడు. అలాంటి నటుడికి కూడా పరిమితులు వచ్చేశాయి ఇందులో చేసిన మరక్కార్ పాత్ర వల్ల. హెవీ మేకప్.. గడ్డం వల్ల ఆయన తనదైన శైలిలో హావభావాలు పలికించడానికి స్కోప్ లేకపోయింది. అలాగే ఈ పాత్ర కూడా భావోద్వేగాలు పలించడానికి ఆస్కారమూ ఇవ్వలేదు. లాల్ అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్లు కూడా ఇందులో తక్కువే. దీని కంటే ‘పులిమురుగన్’ తరహా మామూలు కమర్షియల్ సినిమానే మేలు. ఇక ఈ సినిమాలో కాస్టింగ్ పరంగా మనవాళ్లు ఎక్కువగా కనెక్ట్ అయ్యేది కీర్తి సురేష్ తోనే. ఆమె పాత్ర కూడా నిరాశ పరుస్తుంది. ఆమె లవ్ ట్రాక్ చాలా అసహజంగా.. కొంత మేర జీర్ణించుకోలేని విధంగా తయారైంది. అర్జున్ కీలక పాత్రలో రాణించాడు. ప్రభు గురించి చెప్పడానికేమీ లేకపోయింది. అశోక్ సెల్వన్ పర్వాలేదు. సునీల్ శెట్టి చాలా మామూలుగా అనిపిస్తాడు. మోహన్ లాల్ అనే కాదు.. సినిమాలో ఏ పాత్రకూ తగిన ఎలివేషన్ లేకపోవడంతో ఏ పాత్రా సరిగా పండలేదు.

సాంకేతిక వర్గం:

సాబు సిరిల్ లాంటి లెజెండ్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు తీసుకోవడం వల్ల ఈ కథ నడిచిన కాలానికి తగ్గట్లుగా నేటివిటీ బాగానే తెరపైకి తీసుకురాగలిగారు.ఈ విషయంలో సినిమా అంతటా నిలకడ కనిపిస్తుంది. సముద్రం నేపథ్యంలో వచ్చే యుద్ధ సన్నివేశం ఒకటి భారీతనంతో ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువల పరంగా ఢోకా లేకపోయినప్పటికీ.. ‘బాహుబలి’ తరహా విజువల్ గ్రాండియర్ అయితే ఇందులో కనిపించదు. రాఫెల్.. రాహుల్ రాజ్ కలిసి అందించిన సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. పాటలకు ఇందులో ప్రాధాన్యం లేదు. నేపథ్య సంగీతం హాలీవుడ్ సినిమాల తరహాలో క్లాస్ గా సాగుతుంది. అది కొంత నిరాశ కలిగించే విషయమే. తిరు ఛాయాగ్రహణం గొప్పగా సాగింది.

రైటర్ కమ్ డైరెక్టర్ ప్రియదర్శన్ ఎంత కష్టపడ్డప్పటికీ.. ఈ తరహా సినిమాలు ఆయనకు సూట్ కాదు అనిపిస్తుంది. ఇలాంటి భారీ కథలను ఎంచుకున్నప్పుడు కచ్చితంగా కమర్షియాలిటీ గురించి ఆలోచించాలి. ప్రేక్షకులను ఎమోషనల్ గా కదిలించాలి. రోమాంచితుల్ని చేసే ఘట్టాలు ఉండేలా చూసుకోవాలి. కానీ ఒక మామూలు కథను చెప్పినట్లే ఈ కథను కూడా ఆయన చెబుతూ వెళ్లారు. ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచడంలో ప్రియదర్శన విఫలం కావడంతో ‘మరక్కార్’ సగటు చిత్రంగా మిగిలిపోయింది.

చివరగా: మరక్కార్.. మామూలు సినిమా

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre


Tags:    

Similar News