'భీమ్లా నాయక్' నుంచి మాస్ ఫీస్ట్ రెడీ!

Update: 2021-12-11 05:46 GMT
పవన్ కల్యాణ్ .. రానా ప్రధాన పాత్రధారులుగా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందింది. పవన్ భార్య పాత్రలో నిత్యా మీనన్ నటించగా, రానా సరసన నాయికగా సంయుక్త మీనన్ పరిచయమవుతోంది.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఒక్కో అప్ డేట్ వదులుతూ వస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ .. తమన్ స్వరపరిచిన పాటలు అంచనాలు పెంచుతూ వెళుతున్నాయి. ఈ సినిమా టైటిల్ సాంగ్ తో పాటు మిగతా సాంగ్స్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది.

ఈ నెల 20వ తేదీన ఈ సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇంకా ఈ సినిమా నుంచి రెండు పాటలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది.

వాటిలో పవన్ కల్యాణ్ పాడిన పాట ఒకటి ఉంది. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ ఒక మాస్ సాంగ్ పాడారు. గతంలో ఆయన కొన్ని సినిమాల్లో తనదైన స్టైల్లో కొన్ని పాటలు పాడారు. 'కాటమరాయుడా కదిరి నరసింహుడా' వంటి పాటలు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి. అలా మాస్ ఆడియన్స్ ను హుషారెత్తించే పాట ఒకటి ఈ సినిమాలో ఉందట.

ఈ పాటను పవన్ పాడితేనే కిక్కు వస్తుందని చెప్పేసి, తమన్ పట్టుబట్టి పాడించాడట. ఇంతకుముందు పవన్ పాడిన పాటలను మించి ఈ పాట ఉండేలా తమన్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడని అంటున్నారు.

మరి 20వ తేదీన రిలీజ్ కానున్న సాంగ్ పవన్ పాడినదా? లేదంటే వేరే పాటనా? అనే విషయంలో క్లారిటీ రావలసి. పవన్ పాడిన పాటను రిలీజ్ కి కొన్ని రోజుల ముందుగా .. ఫైనల్ సాంగ్ గా రిలీజ్ చేద్దామనే ఆలోచన చేసే అవకాశం కూడా లేకపోలేదు. అభిమానులు మాత్రం పవన్ పాడిన పాటనే రావాలని కోరుకుంటున్నారు.

ఇది మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి రీమేక్. హిట్టుతో పాటు ప్రశంసలను అందుకున్న సినిమా. పవన్ క్రేజ్ కి రానా ఇమేజ్ కూడా తోడవుతోంది.

ఇక ఈ సినిమాకి స్క్రీన్ ప్లే .. సంభాషణలు అందించడమే కాకుండా, త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడు. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి మరి.


Tags:    

Similar News