మహేష్ కోసం ఎలాంటి హీరోయిన్ ని తీసుకోవాలో జక్కన్నకు చెప్పాలా..!

Update: 2022-10-22 05:31 GMT
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో #SSMB29 ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇదొక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ అని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఇది ఇండియన్ సినిమాలో అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటని చెప్పాలి.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. RRR ప్రమోషన్స్ కోసం జపాన్ లో ఉన్న రాజమౌళి.. ఆస్కార్ క్యాంపెయిన్ పూర్తైన తర్వాత మహేశ్ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. అయితే అంతకంటే ముందే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ గురించి నెట్టింట అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

SSMB29 లో మహేశ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ని ఎంపిక చేసినట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఓ వర్గం అభిమానులు ఖుషీ అవుతుంటే.. మరికొందరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం సంతోషంగా లేరు. దీపికా ని ప్రధాన కథానాయికగా తీసుకోవద్దని సోషల్ మీడియా వేదికగా రాజమౌళి కి రిక్వెస్టులు పెడుతున్నారు.

దీపికా ఇప్పుడు అవుట్ డేటెడ్ హీరోయిన్ అయిపోయిందని.. ఆమెకు బదులుగా మహేశ్ బాబు కోసం ఎవరైనా ఫ్రెష్ ఫేస్ ని తీసుకురావాలని మేకర్స్ ని కోరుతున్నారు. దీపికా ఇప్పటికే ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' సినిమాలో భాగం అవుతోంది కాబట్టి.. మళ్లీ తెలుగులో మరో బిగ్ ప్రాజెక్ట్ లోకి తీసుకుంటే ఫ్రెష్ గా అనిపించదని అంటున్నారు.

మరికొందరు మాత్రం దీపికా బాలీవుడ్ కు చెందిన హీరోయిన్ కావడంతో.. బాయ్ కాట్ బ్యాచ్ కు టార్గెట్ అవ్వకుండా చూసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అయితే తన సినిమాల్లో ఎలాంటి హీరోయిన్ ని తీసుకోవాలో మాస్టర్ మైండ్ ఎస్ ఎస్ రాజమౌళి కి తెలుసనే విషయం ఇక్కడ అందరూ గమనించాలి.

రాజమౌళి కెరీర్ ప్రారంభం నుంచి కూడా పాపులర్ హీరోయిన్లనే తన సినిమాల్లోకి తీసుకుంటూ వస్తున్నారనే విషయాన్ని గ్రహించాలి. కొత్త హీరోయిన్ ని ఎంపిక చేసుకోవడం కంటే.. స్టార్ హీరోయిన్ తీసుకుంటే మార్కెట్ పరంగా వర్కౌట్ అవుతుందని దర్శకుడు భావిస్తుంటారని ఆయన గత చిత్రాలను గమనిస్తే అర్థం అవుతుంది.

RRR సినిమాలో హీరోయిన్ పాత్రకు తక్కువ నిడివి ఉన్నా కూడా భారీ రెమ్యునరేషన్ చెల్లించి అలియా భట్ ని తీసుకున్నారు. ఇది బాలీవుడ్ లో మార్కెట్ పరంగా పని చేయడమే కాదు.. సీత వంటి శక్తివంతమైన పాత్ర సినిమాకు కూడా బాగా ప్లస్ అయింది. ఆమె పైనున్న నెగెటివిటీని సైతం పాజిటివిటీగా మార్చేశారు జక్కన్న.

ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం కూడా దర్శకధీరుడు తగిన హీరోయిన్ ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. దానికి తగ్గట్టుగానే కథానాయిక ఉండేలా చూసుకుంటున్నారు. ఒకవేళ దీపికా పడుకునే నే రాజమౌళి ఫైనలైజ్ చేసినా.. మహేశ్ ఎత్తు మరియు తేజస్సుకు ఆమె సరిగ్గా సరిపోతుంది.

మహేష్ బాబుతో ఇప్పటి వరకు తన కెరీర్ లోనే అతిపెద్ద సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ఇటీవల తెలిపారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ SSMB28 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇదొక హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇదే క్రమంలో రాజమౌళి - మహేష్ కాంబోలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News