సీఎంతో భేటీ.. సినీ ప్రముఖుల ప్రతిపాదనలు ఇవే..!

Update: 2022-02-10 10:16 GMT
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. సినిమా ఇండస్ట్రీల సమస్యలపై జరిగిన ఈ మీటింగ్ లో చిరంజీవి - మహేష్‌ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ - ఆర్.నారాయణమూర్తి - అలీ - పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన టాలీవుడ్ పెద్దలు.. సమావేశం సంతోషపరిచిందని అన్నారు.

ఐదో షోకు పర్మిషన్ ఇచ్చారని.. అంతేకాదు ఈ నెలాఖరులోపు అందరికీ ఆమోదయోగ్యమైన జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను సీఎం జగన్ ముందు ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.

* ఏసీ - నాన్ ఏసీ థియేటర్స్ - మల్టీప్లెక్స్ లలో ఆమోదయోగ్యమైన టికెట్ ధరలు

* చిన్న చిత్రాలకు 5 షోలు

* భారీ బడ్జెట్ సినిమాకు ప్రత్యేక వెసులుబాటు

* టికెట్ విక్రయాల్లో పారదర్శకత.. ఆన్లైన్ టిక్కెటింగ్ ను ఫిలిం ఛాంబర్ కు అప్పగించడం

* ప్రభుత్వ, చారిత్రక ప్రదేశాల్లో అద్దె లేకుండా సినిమా షూటింగులు

* ఏడాదిలో 15 వారాలు చిన్న సినిమాల ప్రదర్శన

* ఏటా ఎంపిక చేసిన తెలుగు సినిమాలకు నంది అవార్డులు

* ఎంపిక చేసిన చిత్రాలకు సబ్సిడీ.. జీఎస్టీ మినహాయింపు

* డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు చార్జీల మినహాయింపు

* థియేటర్లకు ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు.. విధ్యుత్ సబ్సిడీ

* నిర్మాతలు, దర్శకులు, కళాకారుల ఇళ్ల నిర్మాణం కోసం భూముల కేటాయింపు

* షూటింగుల్లో పని చేసే కార్మికులకు కార్మిక చట్టాలు అమలు

* స్టూడియోల నిర్మాణాలకు భూముల కేటాయింపు

* టాలీవుడ్ కు పరిశ్రమ హోదా

* మినీ థియేటర్లకు అనుమతి

సీఎం జగన్ తో భేటీ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ సుహృద్భావ వాతావరణంలో పరిశ్రమకు సమస్యలపై చర్చలు జరిగాయని తెలిపారు. సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తమకు సంతోషం కలిగించిందని.. టికెట్‌ ధరల పెంపు ఇతర సమస్యలకు మంత్రి పేర్ని నాని చొరవతో శుభం కార్డు పడినట్లే భావిస్తున్నామని తెలిపారు. చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామమని.. ఈ నెలాఖరులో జీవో వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు. హైదరాబాద్‌ తరహాలో వైజాగ్‌ లో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని జగన్‌ చెప్పారని.. దీనికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పామన్నారు చిరంజీవి. ఇదే క్రమంలో మహేష్ బాబు - రాజమౌళి - ప్రభాస్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వానికి సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమ కష్టాలను చిరంజీవి సీఎం దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. చిరంజీవి గారి కష్టానికి అభినందిస్తున్నాను. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటారు చిరంజీవి. ఇండస్ట్రీ కోసమే ఆలోచిస్తారు. అందరూ సినిమా కష్టాల గురించి చెప్పారు. సీఎం అన్ని నోట్ చేసుకున్నారు. అందరికి ఆమోదయోగ్యంగా జగన్ గారు సమాధానం చెప్పారు. నెలాఖరులోపు అన్నిటికి సమాధానం వస్తుంది. నేను ఫిలిం ఛాంబర్ వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా కష్టాలు చెప్పారు. జగన్ గారు చిన్న సినిమాకి కూడా సపోర్ట్ చేస్తామన్నారు. ఇండస్ట్రీని ఏపీలో కూడా డెవలప్ చేయాలన్నారు.. ఇక్కడ కూడా షూటింగులు చేసుకోవాలని కోరారని పేర్ని నాని తెలిపారు.
Tags:    

Similar News