ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌పై ఏపీ సీఎంతో మెగాస్టార్ భేటీ

Update: 2021-06-23 09:30 GMT
క‌రోనా క‌ష్ట కాలంలో సీసీసీ కార్య‌క‌లాపాల‌తో ప‌రిశ్ర‌మ కార్మికుల్ని ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి సెకండ్ వేవ్ ధాటికి విల‌విల‌లాడుతున్న‌ క‌రోనా రోగుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసి ఇరు తెలుగు రాష్ట్రాల్లో అంద‌రి దృష్టిలో దేవుడ‌య్యారు.  ఇప్పుడు ఆయ‌న మ‌రోసారి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ పున‌రుద్ధ‌ర‌ణ‌కు న‌డుం క‌ట్టారా? అంటే అవున‌నే స‌మాచారం. మొద‌టి వేవ్ అనంత‌రం థియేట‌ర్ల స‌మ‌స్య‌ల‌పైనా ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పైనా ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో చిరంజీవి మాట్లాడారు. ఇప్పుడు మ‌రోసారి సీఎంల‌తో భేటీకి ఆయ‌న రెడీ అవుతున్నార‌ని సమాచారం.

సీఎంతో కీల‌క భేటీలో చిరు ఏం మాట్లాడ‌తారు? అంటే.. క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికే థియేట‌ర్లు మూత ప‌డ్డాయి. దీనికి తోడు ఏపీ సీఎం జ‌గ‌న్ టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపు నిర్ణయం ప‌రిశ్ర‌మ‌కు పెను విఘాతంగా మారింది. ఇప్పుడు థియేట‌ర్లు తెరిచినా తిరిగి పెద్ద సినిమాలు ఆడాలంటే టిక్కెట్టు ధ‌ర‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం మారాల్సి ఉంటుంది. సరిగ్గా రిలీజ్ ముంగిట టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపుతో వ‌కీల్ సాబ్ తీవ్రంగా న‌ష్ట‌పోయిన సంగ‌తి తెలిసిందే. అయితే థియేట‌ర్లు మ‌నుగ‌డ సాగించాలంటే ఇప్పుడు అమ‌ల్లో ఉన్న ధ‌ర‌ల‌తో ఏమాత్రం ప‌న‌వ్వ‌ద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.  

అందుకే ఇప్పుడు ఈ ప‌రిస్థితుల్ని చ‌క్క దిద్దాలంటే ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ అవ్వాల‌ని మెగాస్టార్ చిరంజీవి భావించార‌ట‌. ఆయ‌న కొంద‌రు సినీప్ర‌ముఖుల‌తో క‌లిసి త్వ‌ర‌లోనే సీఎం జ‌గ‌న్ ని క‌లిసి ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల‌పై మంత‌నాలు సాగిస్తార‌ని తెలుస్తోంది. టిక్కెట్టు ధ‌ర‌ల పెంపు స‌హా క‌రోనా వ‌ల్ల థియేట‌ర్ రంగం ఇబ్బందుల‌పైనా ముచ్చ‌టిస్తారు. స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కోర‌తారు. మునుప‌టిలా రాయితీలు కోరేందుకు ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది. ఇక ఇదే భేటీలో విశాఖ‌లో సినీప‌రిశ్ర‌మ ఏర్పాటు పైనా మంత‌నాలు సాగే అవ‌కాశం ఉండ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా సీఎం జ‌గ‌న్ పై మెగాస్టార్ బాణీ మారింది. ముఖ్య‌మంత్రి ప‌నితీరును ఆయ‌న కొనియాడ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తాజా భేటీలో టాలీవుడ్ స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకు చిరంజీవి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News