మళ్లీ పాన్ ఇండియాపై గురిపెడుతున్న మెగాస్టార్..?

Update: 2022-08-05 10:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరోలు మరియు కొందరు టైర్-2 హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. అయితే సూపర్ సీనియర్ హీరోలలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే పాన్ ఇండియా మూవీ చేసిన జాబితాలో ఉన్నారు.

చిరు నటించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని ఒకేసారి తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేశారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ మళ్లీ పాన్ ఇండియాపై గురిపెట్టడానికి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది.

చిరంజీవి ప్రస్తుతం లైన్ లో పెట్టిన చిత్రాల్లో 'గాడ్ ఫాదర్' ఒకటి. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' కు అధికారిక తెలుగు రీమేక్. ఇందులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

షూటింగ్ చివరి దశకు చేరుకున్న 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని విజయదశమి బరిలో నిలపనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం చిరంజీవి నటిస్తున్న ఈ 153వ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

మలయాళం మినహా మిగిలిన ప్రధాన భారతీయ భాషలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. చిరంజీవి కి తోడుగా సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు కాబట్టి.. ముఖ్యంగా హిందీ మార్కెట్ మీద ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారట.

నిజానికి మెగా తండ్రీకొడుకులు కలిసి చేసిన 'ఆచార్య' చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే తెలుగులో డిజాస్టర్ గా మారడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. కానీ ఈసారి 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా ఒరిజినల్ వెర్సన్ 'లూసిఫర్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అన్ని భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాన్ని రీమేక్ చేయడమే కాదు.. మళ్లీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయడం సరైన నిర్ణయమేనా అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

కాగా, 'గాడ్ ఫాదర్' అనేది హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో మెగాస్టార్ తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో దీనిపై క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు ఈ సినిమాలో చిరుకు జోడీ కూడా ఉండదు. నయనతార సినిమాలో నటిస్తోంది కానీ.. ఆమెది హీరోయిన్ రోల్ కాదు.

ఇక మలయాళంలో డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. సత్యదేవ్ - సునీల్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

'గాడ్ ఫాదర్' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఆర్‌బి చౌదరి - ఎన్‌వి ప్రసాద్‌ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News