మరోసారి టాప్‌ స్టార్‌ ఆత్మహత్య యత్నం

Update: 2019-03-18 07:27 GMT
ప్రపంచ పాప్‌ సామ్రాజ్యాన్ని తన సంగీతంతో పరిపాలించిన పాప్‌ రారాజు మైకేల్‌ జాక్సన్‌ చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నారు, ఎదుక్కొంటూనే ఉన్నారు. మైకేల్‌ జాక్సన్‌ యువకులపై చిన్నపిల్లలపై లైంగిక దాడి చేసేవాడని, ఆయన వల్ల ఎంతో మంది పిల్లలు ఇబ్బంది పడ్డారు అనేది చాలా మంది చెప్పే విషయం. తాజాగా మైకేల్‌ జాక్సన్‌ గురించి రాబోతున్న ఒక డాక్యుమెంటరీలో కూడా ఈ విషయాన్ని చూపించబోతున్నారు. లివింగ్‌ నెవర్‌ ల్యాండ్‌ అనే పేరుతో రూపొందుతున్న ఆ డాక్యుమెంటరీకి సంబంధించి కొన్ని సీన్స్‌ లీక్‌ అయ్యాయి.

లీక్‌ అయిన సీన్స్‌ లో మైకేల్‌ జాక్సన్‌ యువకులను లైంగికంగా వేదించినట్లుగా చూపించారు. తన తండ్రి విషయంలో అలాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మైకేల్‌ జాక్సన్‌ కూతురు ప్యారిస్‌ జాక్సన్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యిందట. దాంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీసులు చెబుతున్నారు. ప్యారిస్‌ కత్తితో చేయి కోసుకున్న విషయం వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను ఎమర్జెన్సీ వాహనంలో హాస్పిటల్‌ కు తరలించారు. కుటుంబ సభ్యులు మరియు పోలీసులు కూడా ఆ విషయాన్ని నిర్థారించారు.

అయితే తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలను ప్యారిస్‌ జాక్సన్‌ ఖండిస్తోంది. తనకు ఎలాంటి డిప్రెషన్‌ లేదని, తాను బాగానే ఉన్నాను అంటూ ఆమె సోషల్‌ మీడియా ద్వారా పేర్కొంది. మైకేల్‌ జాక్సన్‌ వారసురాలిగా ప్యారిస్‌ జాక్సన్‌ కు మంచి గుర్తింపు ఉంది. నటిగా మోడల్‌ గా టాప్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న ప్యారిస్‌ 2013లో కూడా ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలం అయ్యింది. తన తండ్రిపై వస్తున్న పుకార్లకు ఆమె ఎప్పుడు కూడా ఆవేదన చెందుతూ ఉండేదని, తాజాగా మరోసారి మైకేల్‌ యువకులపై లైంగిక దాడి చేశాడంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
Tags:    

Similar News