‘విక్రమార్కుడు’ నిర్మాత ఎన్నాళ్లకెన్నాళ్లకో..

Update: 2017-03-20 04:25 GMT
ఎం.ఎల్.కుమార్ చౌదరి.. ‘శ్రీ కీర్తి క్రియేషన్స్’ బేనర్ మీద ఒకప్పుడు టాలీవుడ్లో వరుసగా సినిమాలు తీసిన నిర్మాత. ఆయన రెండంకెల సంఖ్యలో సినిమాలు తీశారు కానీ.. వాటిలో ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘విక్రమార్కుడు’. రాజమౌళి తీసిన ఈ చిత్రం ఆయనకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. తెలుగులో థియేట్రికల్ రన్.. శాటిలైట్ హక్కుల ద్వారానే కాకుండా నాలుగైదు భాషల రీమేక్ హక్కుల ద్వారా కూడా ఆయనకు బోలెడంత ఆదాయం తెచ్చిపెట్టిందీ సినిమా. కానీ ఈ సినిమా తెచ్చిన లాభాల్ని డాన్.. బావ.. సరదాగా కాసేపు.. అధినాయకుడు లాంటి సినిమాలు పోగొట్టాయి. ‘అధినాయకుడు’ దెబ్బకు ఆయన సినిమాలే మానేశారు. ఐదేళ్ల నుంచి అడ్రస్ లేకుండా పోయారు.

ఐతే సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్లీ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వరరెడ్డి నిర్మాణంలో ‘ఆచారి అమెరికా యాత్ర’ పేరుతో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరినే. ఐతే ఆయన బేనర్ ‘శ్రీ కీర్తి క్రియేషన్స్’ పక్కకు వెళ్లిపోయింది. ‘పద్మజ ఫిలిమ్స్’ పేరుతో కొత్త బేనర్ మీద ఈ సినిమా తీస్తున్నారు. పోస్టర్ మీద కుమార్ చౌదరి సమర్పకుడిగా మాత్రమే కనిపిస్తున్నారు. ఆయన పిల్లలు కీర్తి చౌదరి.. కిట్టు దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్.. ఫస్ట్ లుక్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ఓ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News