సినిమా టికెట్ రేట్లు తగ్గించారు.. కరెంట్ బిల్లులు ఏంటి సార్..?

Update: 2021-12-25 06:30 GMT
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వ్యవహారం మీద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్‌ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. టికెట్‌ ధరల తగ్గింపు జీవోపై పలువురు ఎగ్జిబిటర్స్ హైకోర్టు ఆశ్రయించగా.. జీవో నెం.35ను న్యాయస్థానం రద్దు చేసింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. దీంతో టికెట్ ధరల వ్యవహారం ఇంకా కోర్టు విచారణలో ఉంది. దీనిపై వచ్చే నెల 4న తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు థియేటర్‌లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలను అతిక్రమించారంటూ ఇప్పటికే కొన్ని థియేటర్లను సీజ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంకొన్ని థియేటర్లను స్వచ్ఛందంగా మూసి వేశారు.. అలానే ప్రభుత్వం నిర్దేశించిన రేట్లతో థియేటర్లు నిర్వహించలేమని మరికొన్ని సినిమా హాళ్లకు తాళం పడింది. ఈరోజుల్లో రూ.5 - రూ.10 - రూ.15 తో సినిమాలు ప్రదర్శించలేమంటూ చేతులెత్తేస్తున్నారు.

స్లాబుల వైజ్ ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు కనిష్టంగా రూ.5 - గరిష్టంగా రూ. 250 ఉందనే సంగతి తెలిసిందే. ఈ రేట్లు అన్ని సినిమాలకు వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదనేది ఎగ్జిబిటర్స్ వాదన. ఎందుకంటే ప్రస్తుతం సినిమా మార్కెట్ బాగా పెరిగి పోయింది. ఇప్పుడు సినిమా మేకింగ్ అనేది గటంతో పోల్చుకుంటే రెట్టింపు వ్యయంతో కూడుకున్న వ్యవహారంగా మారింది.

సినిమాలో తెర మీద కనిపించే నటీనటుల కష్టం కంటే.. బ్యాక్ ఎండ్ లో పని చేసే ఎంతో మంది సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది కష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు దానికి తగ్గ ప్రతిఫలం ఆశిస్తుంటారు. శ్రమకు తగిన శాలరీ కోరుకోవడాన్ని మనం తప్పు పట్టలేం. అందులోనూ ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా పాకింది. ఇండియాలో మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే టాలీవుడ్ టాప్ లో ఉంది. అందుకు తగ్గట్టుగానే మన సినిమాల నిర్మాణం ఉండేలా.. నిర్మాతలు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తున్నారు.

ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా వారం రోజులు మాత్రమే థియేటర్ లో ఉండే పరిస్థితి వచ్చింది. పైరసీ ఓటీటీలను తట్టుకొని ఆ వారంలోనే సినిమాకు పెట్టిన పెట్టుబడి వెనక్కి రాబట్టాల్సి ఉంటుంది. రూ.10 - రూ.15 లతో సినిమాకు పెట్టిన బడ్జెట్ రికవరీ చేయలేమని నిర్మాతలు ఎగ్జిబిటర్స్ అభిప్రాయ పడుతున్నారు. అందుకే టికెట్ ధరల మీద పునరాలోచించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇకపోతే టికెట్ రేట్లు తగ్గించిన ప్రభుత్వం కరెంట్ బిల్లును మాత్రం అధిక మొత్తంలో వసూలు చేయడాన్ని పలువురు థియేటర్ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం నిర్దేశించిన టికెట్ ధరలతో సినిమాలని ప్రదర్శిస్తే వచ్చే డబ్బు.. కరెంట్ బిల్లులు కట్టడానికి కూడా సరిపోదని.. మెయింటెనెన్స్ ఖర్చులు మళ్ళీ అదనపు భారంగా మారుతాయని వాపోతున్నారు. అందుకే దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని.. థియేటర్లను కాపాడాలని కోరుకుంటున్నారు.

వాస్తవానికి ఒక సినిమా విడుదలైతే నిర్మాతలే కాకుండా బయ్యర్లు - థియేటర్‌ యజమానులు - క్యాంటీన్‌ నిర్వాహకులు - థియేటర్‌ లోని పార్కింగ్‌ సిబ్బంది.. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలు బ్రతుకుతుంటాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొన్ని థియేటర్లకు తాళం వేస్తుంటే.. మరికొన్ని స్వచ్ఛందంగా మూతబడుతున్నాయి. దీని వల్ల వాటిపై ఆధారపడి జీవించేవారికి ఆవేదన తప్పడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగి థియేటర్ల నిర్వహణ కష్టంగా మారితే.. వచ్చే రెండేళ్లలో సింగిల్‌ థియేటర్లు చాలా వరకూ సూపర్‌ మార్కెట్లుగా, కల్యాణ మండపాలుగా రూపాంతరం చెందుతాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News