మ‌హేష్‌-మురుగ‌దాస్ టైటిల్ అదేనా?

Update: 2015-12-30 17:30 GMT
ఆలూ లేదు చూలూ లేదు.. అన్నట్లుంది మహేష్ సినిమా వ్యవహారం. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ సినిమా మొదలవడానికి ఇంకా నాలుగైదు నెలలు టైం ఉంది. కానీ ఈ లోపే ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా కథ.. బడ్జెట్.. షూటింగ్ లొకేషన్లు.. ఇలా అనేక విషయాల గురించి ఇప్పటికే చాలా వార్తలు వినిపించాయి. ఇప్పుడిక టైటిల్ గురించి చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ ‘చట్టంతో పోరాటం’ టైటిల్ దీని కోసం వాడుతున్నట్లు కొన్ని రోజుల కిందట వార్తలొచ్చాయి. తాజాగా మరో కొత్త టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అదే.. ‘ఎనిమీ’.

మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో రాబోయేది ఓ రివెంజ్ స్టోరీ అని ఇంతకుముందే ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే ‘ఎనిమీ’ అనే టైటిల్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ టైటిల్‌ ను ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్లు కూడా అంటున్నారు. ఐతే ఇది తెలుగు వరకే పరిమితమయ్యే అవకాశముంది. తమిళ వెర్షన్‌కు ఇంగ్లిష్ టైటిల్ పెట్టడానికి వీల్లేదు. ఇటీవలే హిందీలో ‘అకీరా’ సినిమాను పూర్తి చేసిన మురుగదాస్.. ప్రస్తుతం మహేష్ సినిమాకు స్క్రిప్టు ఫైనలైజ్ చేసేశాడు కూడా. ముంబయిలోనే రెండు నెలలకు పైగా షూటింగ్ చేయడానికి ప్లానింగ్ కూడా పూర్తయింది. ఏప్రిల్ నెలలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.
Tags:    

Similar News