సైబ‌ర్ క్రైమ్ పోలీస్ కి మైత్రి సంస్థ‌ ఫిర్యాదు

Update: 2021-08-16 04:28 GMT
నిర్మాణంలో ఉన్న సినిమా కంటెంట్ ని ఎంతగా దాచాల‌నుకున్నా లీకులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. దీంతో నిర్మాత‌ల్లో ఆందోళ‌న పెరుగుతోంది. కొన్నిసార్లు సైబ‌ర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసి నేర‌స్తుల‌ను శిక్షిస్తున్నారు. ఇటీవ‌ల కొన్ని వ‌ర‌స లీకులు మైత్రి సంస్థ‌లో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మ‌య్యాయి. అందులో ముఖ్యంగా మ‌హేష్ న‌టిస్తున్న స‌ర్కార్ వారి పాట‌.. అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప‌-1 నుంచి లీకులు ప్ర‌ధానంగా మైత్రి సంస్థ‌ను క‌ల‌వ‌రపెట్టాయి.

ఎంతో ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలను ప్లాన్ చేసిన మైత్రి  మూవీ మేకర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. మొదటి టీజర్.. ఒక పాట అధికారిక విడుదలకు ముందే ఆన్ లైన్ లో లీక్ కావడంతో మేకర్స్ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. పుష్ప నుండి దాక్కో దాక్కో మేకా తెలుగు వెర్షన్ షెడ్యూల్ చేసిన‌ తేదీకి ముందే సోషల్ మీడియాలో లీకులు క‌ల‌వ‌ర‌పెట్టాయి. కొన్ని గంట‌ల ముందే ఈ పాట లీకైపోయింది. లీకులు తమను కలవరపెట్టాయని కార‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని  నిర్మాత‌లు చెప్పారు.

``ఇటీవల మా మూవీ మెటీరియల్ ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాం. మేము దీనిని ఖండిస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీసుల‌కు దీనిపై ఫిర్యాదు చేశాము. త్వరలోనే నిందితులపై చట్టం ద్వారా కేసులు నమోదు చేయబడతాయి. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దు..`` అంటూ మైత్రి సంస్థ ట్వీట్ చేసింది. మహేష్ - కీర్తిసురేష్ జంట‌గా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ సర్కార్ వారి పాట మొదటి టీజర్ మ‌హేష్‌ పుట్టినరోజున విడుదలైంది. అభిమానులలో వైర‌ల్ గా దూసుకెళ్లింది. అల్లు అర్జున్ నటించిన `పుష్ప` రెండు భాగాలుగా విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప‌-1 ఈ క్రిస్మస్ కానుక‌గా 2021లో థియేటర్లలోకి రానుంది.
Tags:    

Similar News