ఆ డైరెక్టర్..ఆ ప్రొడ్యూసర్..పెళ్లి చేసేసుకున్నారు

Update: 2015-12-07 10:03 GMT
ఆమె నిర్మాత.. అతడు డైరెక్టర్.. ఇద్దరూ కలిసి ఓ అభిరుచి ఉన్న సినిమా తీశారు. ఆ సినిమా షూటింగులోనే ఇద్దరి అభిరుచులు కలిశాయి. ఐతే సినిమా షూటింగ్ అయిపోయింది. విడుదలై మంచి పేరు కూడా సంపాదించింది. అంతటితో వాళ్లిద్దరి బంధం ముగిసిపోలేదు. కలిసి సినిమా చేసిన వాళ్లు కలిసి జీవనం సాగించాలన్న నిర్ణయించుకున్నారు. పెద్దలకు చెప్పారు. వాళ్లూ ఓకే అన్నారు. పెద్దగా హడావుడేమీ లేకుండా ఇద్దరూ సింపుల్ గా పెళ్లాడేశారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. నాగ్ అశ్విన్, ప్రియాంక దత్.

అశ్వనీదత్ కూతురైన ప్రియాంక.. జేజే హాస్పిటల్స్ అధినేత డాక్టర్ జయంతి కొడుకైన నాగ్ అశ్విన్ సోమవారం హైదరాబాదులో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి పెద్దగా హంగామా లేకుండా సింపుల్ గా జరిగిపోయింది. వీళ్లిద్దరూ కలిసి ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా దర్శకుడిగా అశ్విన్ కు, నిర్మాతగా ప్రియాంకకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అశ్విన్ అమెరికాలో చదువుకుని ఆ తర్వాత శేఖర్ కమ్ముల శిష్యరికం చేసి దర్శకుడిగా మారాడు. ప్రియాంక తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల నిర్మాణంలోకి అడుగుపెట్టింది. తండ్రిలా కాకుండా చిన్న సినిమాలతో ప్రయాణం సాగిస్తున్న ప్రియాంక.. తాను డైరెక్టర్ గా అవకాశమిచ్చిన వ్యక్తితోనే జీవితాన్ని పంచుకోవడం విశేషమే.
Tags:    

Similar News