పంచెకట్టులో నాన్న తరువాతే ఎవరైనా: నాగార్జున

Update: 2021-09-20 08:30 GMT
తెలుగు సినిమా మాట నేర్చుకుని .. పాట కూర్చుకుని .. అడుగులు వేయడం అలవాటు చేసుకుని .. పరుగులు తీయడానికి సిద్ధమవుతున్నప్పుడు అక్కినేని ఎంట్రీ ఇచ్చారు. 'ధర్మపత్ని' సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసిన ఆయన, ఆ తరువాత 'సీతారామ జననం' సినిమాతో హీరో అయ్యారు. 'బాలరాజు' సినిమాతో ఆయనకి స్టార్ డమ్ దక్కింది. 'దేవదాసు' సినిమాతో జగమెరిగిన నటుడిగా ఆయన నీరాజనాలు అందుకున్నారు. తెలుగులో ఎన్ని ప్రేమకథా సినిమాలు వచ్చినప్పటికీ, 'దేవదాసు' అగ్రస్థానం నుంచి అంగుళం కూడా కదలకపోవడానికి అక్కినేని అభినయమే కారణం.

జానపద .. పౌరాణికాలలో తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను అక్కినేని అద్భుతంగా పోషించారు. భగవంతుడి పాత్రలలో ఎన్టీఆర్ ఎంతగా ఒదిగిపోయేవారో, భక్తుడి పాత్రలలో అక్కినేని అంతగానూ ఇమిడిపోయేవారు. 'భక్త జయదేవ' .. ' భక్త తుకారాం' .. 'మహాకవి కాళిదాసు' .. 'చక్రధారి' .. 'విప్ర నారాయణ' వంటి సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి. ఒక రొమాంటిక్ హీరో ఈ తరహా పాత్రలను పోషించి మెప్పించడం ఇప్పటికీ విశేషగానే చెప్పుకుంటారు. ఇక అప్పట్లో గ్రామీణ నేపథ్యంలో పల్లెటూరి బుల్లోడి పాత్రల్లో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు.

పంచె కట్టి .. ముల్లుగర్ర చేతబట్టి .. పొలం గట్లపై గడుసు పిల్లలతో సరసాలాడే పాత్రల్లో ఆయన నటనను ఆ తరువాత కాలంలో అనుసరించని వారు లేరు. ఈ రోజున ఆయన జయంతి కావడంతో, ట్విట్టర్ ద్వారా నాగార్జున ఆయనకి నివాళులు అర్పిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. ఆయన పంచె కట్టును గురించి తలచుకుంటూ, ఆ విషయాలను అభిమానులతో పంచుకున్నారు. "పంచె కట్టడమంటే నాన్నగారికి ఎంతో ఇష్టం .. ముఖ్యంగా 'పొందూరు' ఖద్దరు పంచె కట్టడం అంటే ఆయనకి మరీ ఇష్టం. ఇది అయన నవరత్నాల హారం .. ఇది ఆయన నవరత్నాల ఉంగరం .. ఇది ఆయన ఫేవరెట్ వాచ్ .. ఇప్పుడు నా ఫేవరెట్ వాచ్. ఇవన్నీ చూస్తుంటే ఆయన నాతోనే ఉన్నట్టుగా ఉంటుంది. అంటూ తాను ధరించినవి చూపించారు.

ఆయన కంచె కట్టులోని అందాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసమే అంటూ, 'బంగార్రాజు' సినిమాలోని తన లుక్ ను జోడించారు. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో అక్కినేని మాదిరిగానే పంచెకట్టుతో నాగార్జున సందడి చేశారు. ఆ పాత్ర ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ కావడంతో, గ్రామీణ నేపథ్యంలోనే 'బంగార్రాజు'ను ప్లాన్ చేశాను. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ నటిస్తుండగా, చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.


Tags:    

Similar News