ఓటీటీ అంటేనే ససేమిరా అనేస్తున్న టాలీవుడ్ హీరో

Update: 2021-04-22 02:30 GMT
నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన మూడు సినిమాల్ని ఓటీటీలో రిలీజ్ చేయాల‌నుకున్నారా? అంటే.. అవున‌నేది కొన్ని క‌థ‌నాల సారాంశం. ఇంత‌కుముందు ఇంద్ర‌గంటితో వీ సినిమా రిలీజ్ స‌మ‌యంలో సందిగ్ధ‌త తెలిసిందే. తొలుత ఈ చిత్రాన్ని థియేట్రిక‌ల్ రిలీజ్ చేస్తార‌ని ప్ర‌చార‌మైనా చివ‌రికి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. కానీ అది థియేట‌ర్ల‌లో చూడాల్సిన సినిమా అని నానీ ప‌దే ప‌దే వాదించారు. అస‌లు ఓటీటీ రిలీజ్ ఇష్టం లేదు.

ఇప్పుడు నాని న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల్ల వాయిదా ప‌డింది. దీనిని కూడా ఓటీటీలోనే రిలీజ్ చేస్తార‌న్న ప్ర‌చారం సాగుతోంది. కానీ OTT డైరెక్ట్ రిలీజ్ కి నాని నో చెప్పారు.అలాగే నాని న‌టించిన మ‌రో చిత్రం శ్యామ్ సింఘరాయ్ ను ఆగస్టు లేదా సెప్టెంబరులో విడుదల చేయాలనుకున్నాడు. అది కేవ‌లం థియేట్రిక‌ల్ రిలీజ్ మాత్ర‌మే.

సెకండ్ వేవ్ వ‌ల్ల ఇండ‌స్ట్రీలో అన్ని సినిమాలు వాయిదా పడుతుండ‌డంతో ర‌క‌ర‌కాల సందిగ్ధ‌త‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టక్ జగదీష్ ఇప్ప‌ట్లో థియేటర్లలోకి రాదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మే చివరి వరకు సెకండ్ వేవ్ కొనసాగుతుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి సినిమాలు జూన్ లేదా జూలైలో మాత్రమే విడుదల కావచ్చని అంచ‌నా. అప్ప‌టివ‌ర‌కూ ఆగ‌క‌పోతే ఓటీటీలో రిలీజ్ చేయాలా? అంటే నాని స‌సేమిరా అనేశార‌ట‌.

కొంతమంది నిర్మాతలు డైరెక్ట్- OTT విడుదలల‌ వైపు చూస్తుండగా నాని తన నిర్మాతలకు ఎలాంటి ఆఫర్లకు టెంప్ట్ కావ‌ద్ద‌ని క‌చ్ఛితంగా చెప్పార‌ట‌. థియేటర్లలో టక్ జగదీష్ ను విడుదల చేస్తానని తన అభిమానులకు వాగ్దానం చేశారు. రాబోయే నెలల్లో పరిస్థితి మరింత దిగజారినా వేచి ఉండాలని ఆయన తన నిర్మాతలకు స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా బుధవారం ఈ చిత్రం త్వరలో థియేటర్లలోకి వస్తుందని ప్రకటిస్తూ పోస్ట‌ర్ తో సందేహాల‌కు చెక్ పెట్టారు నిర్మాత‌లు.

ఇక శ్యామ్ సింఘ‌రాయ్ కి ఇంకా చాలా స‌మ‌య‌మే ఉంది కాబ‌ట్టి అప్ప‌టికి క‌రోనా స‌న్నివేశం స‌ద్ధుమ‌ణుగుతుంద‌నే భావిస్తున్నారు. నానీ కెరీర్ లోనే అత్యంత భారీబ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవ‌లం థియేట్రిక‌ల్ రిలీజ్ చేస్తేనే రిట‌ర్నులు సాధ్య‌మ‌ని న‌మ్ముతున్నారు. గ‌త చిత్రం `వీ` స‌న్నివేశం నాని ఇత‌ర రెండు సినిమాల‌కు రాకూడ‌ద‌ని.. థియేట్రిక‌ల్ రిలీజ్ తో పెద్ద స‌క్సెస‌వ్వాల‌నే ఆకాంక్షిద్దాం.
Tags:    

Similar News