ఇటు యాక్షన్.. అటు ప్రొడక్షన్

Update: 2017-11-24 17:28 GMT
ఇండస్ట్రీలో హీరోలుగా ఓ స్థాయికి చేరుకున్నాక.. స్టార్ స్టేటస్ సంపాదించాక సినిమాలు చేయడానికి నిర్మాతల కోసం వెతుక్కోవాల్సిన పనేం ఉండదు. ఊ అంటే చెక్కులతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఉంటారు. అలాంటప్పుడు సొంతంగా సినిమాలు తీసి రిస్క్ చేయడమెందుకు అనే ట్రెండ్ కు నేటి జనరేషన్ హీరోలు కట్ చెప్పి కొత్త ట్రెండ్ కు తెర లేపుతున్నారు. స్టార్ కిడ్స్ గా సినిమాల్లోకి అడుగుపెట్టి.. హీరోలుగా సక్సెస్ సాధించినా సొంతంగా సినిమాలు తీయడానికి సై అంటున్నారు.

సొంతంగా సినిమాలు తీయడం అనేది రిస్కే అయినా యాక్టర్ గా నేర్చుకోలేని ఎన్నో విషయాలు ప్రొడ్యూసర్ గా నేర్చుకోగలుగుతాం అంటున్నాడు హీరో రామ్ చరణ్ తేజ్. తన తండ్రి చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు. రాబోయే సినిమా సైరా నరసింహారెడ్డి అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్నాడు. నిర్మాతగా మారాకే క్రియేటివ్ గానూ.. బడ్జెట్ పరంగానూ ఎలా ఉండాలో బాగా అర్ధమైందని అంటున్నాడు. ‘‘ఏ సినిమా ఎలా ఆడుతుందో ఎవరు చెప్పగలరు? ఒకటి రెండు ఎదురుదెబ్బలు తగిలినా కచ్చితంగా మంచి సినిమా ఎలా తీయాలో తెలుస్తుంది’’ అంటున్నాడు కండల వీరుడు రానా. తన తండ్రి.. తాతల నుంచి సినిమా ప్రొడ్యూసర్స్ కావడంతో నిర్మాతల ఇబ్బందులు తనకు తెలియనివేం కాదని.. ఫిలిం మేకింగ్ లో కొత్త అవకాశాలు వెతికి పట్టుకోవడం తనకు బాగా ఇష్టమని అంటున్నాడు. ‘‘నేను యాక్టర్ గా నిలదొక్కుకోవాలని అనుకున్నప్పుడు నా దగ్గర మంచి స్ర్ర్కిప్టులున్నా నిర్మాతలు వాటితో సినిమాలు తీయడానికి ఇష్టపడలేదు. ఇవాళ సినిమా ప్రొడ్యూస్ చేయగలిగే స్థాయికి చేరాను. నేను ఇష్టపడిన స్క్రిప్ట్ తో సినిమా రూపొందిస్తానని’’ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు అంటున్నాడు.

సినిమా బడ్జెట్ అదుపు తప్పిపోతోందని మాట బాగా వినిపిస్తున్న రోజుల్లో హీరోలు స్వయంగా ప్రొడ్యూసర్ అవతారమెత్తడం మంచి పరిణామమనే చెప్పాలి. ప్రొడక్షన్ అనేది లాభనష్టాల నుంచి లెక్కల్లోంచే కాకుండా అన్ని రంగాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నంగా చూడటం నేటి జనరేషన్ స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు.
Tags:    

Similar News