బాక్సాఫీస్ వద్ద 'బిగ్' ఫైట్..!

Update: 2022-04-07 05:45 GMT
కరోనా పాండమిక్ తర్వాత ఇండియన్ సినిమా ఎప్పటిలాగే మళ్లీ పుంజుకుంది. భారీ సినిమాలన్నీ ఒక్కటొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే మరికొన్ని రోజుల్లో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ ని చూడబోతున్నాం.

భారీ అంచనాలు నెలకొన్న నాలుగు పెద్ద సినిమాలు.. అది కూడా నాలుగు వేర్వేరు చిత్ర పరిశ్రమలు రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రాలు ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్నాయి. 'బీస్ట్' 'కేజీయఫ్ 2' 'జెర్సీ' వంటి సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అవుతుంటే.. 'ఆచార్య' చిత్రం కాస్త గ్యాప్ తీసుకొని రాబోతోంది.

తమిళ హీరో తలపతి విజయ్ - పూజా హెగ్డే జంటగా నటించిన ''బీస్ట్'' సినిమా ఏప్రిల్ 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను కళానిథి మారన్ నిర్మించారు. ఇప్పటికే వచ్చిన పాటలు - ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

ఏప్రిల్ 14న మోస్ట్ అవైటెడ్ మూవీ ''కేజీయఫ్: చాప్టర్ 2'' థియేటర్లలోకి రాబోతోంది. కన్నడ హీరో యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేస్తారు. 'కేజీఎఫ్ 1' ఘనవిజయం సాధించడంతో పార్ట్-2 పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు - ట్రైలర్ అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. హోంబులే బ్యానర్ పై రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెలుగులో వారాహి సంస్థ రిలీజ్ చేయనుంది.

షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ''జెర్సీ'' సినిమా కూడా ఏప్రిల్ 14వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తెలుగు జెర్సీ కి అధికారిక రీమేక్. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో బీటౌన్ లో బజ్ క్రియేట్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు - సూర్యదేవర నాగవంశీ - బన్నీ వాసు కలిసి ఈ హిందీ చిత్రాన్ని నిర్మించారు.

మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన సినిమా ''ఆచార్య'' ఏప్రిల్ 29న విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పాటలు - టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

ఏప్రిల్ బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్న ఈ నాలుగు సినిమాలు భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది. కాకపోతే ఒకసారి మూడు పెద్ద సినిమాలు వస్తుండటం కచ్చితంగా వసూళ్లపై ప్రభావం చూపుతుంది. ఈ విధంగా చూసుకుంటే సోలో రిలీజ్ అవుతున్న 'ఆచార్య' సినిమాకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. మరి వీటిలో ఏవేవి బ్లాక్ బస్టర్స్ అనిపించుకుంటాయో చూడాలి.
Tags:    

Similar News