అశ్వథ్థామ కు ఓవర్సీస్ లో బజ్ లేదా?

Update: 2020-01-24 09:49 GMT
సంక్రాంతి సినిమాల విడుదలకు ముందు ఓవర్సీస్ లో పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. లాభాల సంగతి దేవుడెరుగు.. కనీసం పెట్టుబడి తిరిగి తీసుకొచ్చే సినిమాలు లేక ఓవర్సీస్ మార్కెట్ డీలా పడిపోయింది. ఇక స్టార్ హీరోల సినిమాలకు నష్టాలు ఎక్కువ కావడంతో ఓవర్సీస్ రైట్స్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే సంక్రాంతి సినిమాలు మాత్రం ఓవర్సీస్ మార్కెట్ కు మంచి ఊపు తీసుకొచ్చాయి.. ఒకవైపు 'అల వైకుంఠపురములో' భారీ కలెక్షన్స్ సాధిస్తుండగా మరోవైపు 'సరిలేరు నీకెవ్వరు' కూడా 2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ మార్కెట్ పరిస్థితి మెరుగైందనే అభిప్రాయాలు వినిపించాయి.

అయితే ఈ ఎఫెక్ట్ కొత్త సినిమాల పై పెద్దగా కనిపించడం లేదని అంటున్నారు. నాగశౌర్య నటించిన 'అశ్వథ్థామ' ఈ జనవరి 31 న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ఓవర్సీస్ లో పెద్దగా బజ్ రావడం లేదని అంటున్నారు. ఓవర్సీస్ మార్కెట్ డల్ గా ఉండడమే కాదు.. దీనికి మరొక కారణం కూడా ఉంది. శౌర్య కు  మొదటి నుంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉందని తెలిసిందే. ఈ సినిమాలో తొలిసారిగా శౌర్య ఒక యాక్షన్ హీరోగా రఫ్ గా కనిపిస్తున్నాడు. దీంతో ఇక్కడ ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. శౌర్య లవర్ బాయ్ లాగా నటించిన సినిమాలకు ఇక్కడ బజ్ ఉండేదని ఈసారి అది కనిపించడం లేదని అంటున్నారు. సాఫ్ట్ ఇమేజ్ ఉండే హీరోలు ఒక్కసారి మాస్ యాక్షన్ రూటుకు మారితే ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉంటుందని కొందరు అంటున్నారు.

అయితే సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులను మెప్పించి మాస్ హీరోగా ఆదరణ చూరగొంటాడా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ ఈ యాక్షన్ హీరో అవతారం ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే మాత్రం అక్కినేని నాగ చైతన్య తరహాలో శౌర్య కూడా సాఫ్ట్ రోల్స్ కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది.
Tags:    

Similar News