మాకు 'ఎఫ్ 2'నే పెద్ద శత్రువు: అనిల్ రావిపూడి

Update: 2022-05-21 17:28 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ జాబితాలోకి అనిల్ రావిపూడి చాలా ఫాస్టుగా చేరిపోయాడు. 'పటాస్' నుంచి ఇంతవరకూ ఆయన తన పరుగును ఆపలేదు. ఒక సినిమాకి మించి మరొక సినిమాతో హిట్ కొడుతూ ఆయన దూసుకుపోతున్నాడు. 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చిన అనిల్ రావిపూడి, కామెడీపై తనకి గల పట్టును మరోసారి నిరూపించుకున్నాడు.  అలాంటి ఆయన ఆ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' సినిమా చేశాడు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడాడు.  

"ఈ కథను  2020 మార్చిలో మొదలుపెట్టాము. కరోనా వేవ్స్ ను దాటుకుంటూ .. తట్టుకుంటూ ముందుకు వెళ్లాము. అలాంటి ఈ సినిమా ఈ నెల 27వ తేదీన మీ ముందుకు రాబోతోంది. మా ముందున్న పెద్ద శత్రువు 'ఎఫ్ 2' .. ఎందుకంటే ఆ సినిమాను మీరు అంత బాగా ఎంజాయ్ చేశారు. సీక్వెల్ గనుక దానిని దాటుకుని ఈ సినిమాను ఇవ్వాలి. అందుకోసం స్క్రిప్ట్ పైనే రెండేళ్లుగా కష్టపడ్డాం. నవ్వడం చాలా ఈజీ .. కానీ కామెడీని క్రియేట్ చేయడం చాలా కష్టం. ఈ సినిమాను నేను అనుకున్నట్టుగా  చేయడానికి సహకరించిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

'ఎఫ్ 2'లో చేసిన వారిలో 80 శాతం మంది ఈ సినిమాలోను ఉన్నారు. తమన్నా ఈ రోజున ఇక్కడికి రాలేకపోయింది .. మెహ్రీన్ చాలా బాగా చేసింది .. సోనాల్ ఈ సినిమాకి కొత్తగా యాడ్ అయింది. పూజ హెగ్డే ఈ సినిమాలో ఒక సాంగ్ చేసింది  .. ఆమెకి నేను థ్యాంక్స్  చెబుతున్నాను. ఇక రాజేంద్రప్రసాద్ గారి నటనంటే నాకు చాలా ఇష్టమనే సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక సునీల్ గారు .. అలీ గారు కూడా తమ కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు. ఈ సినిమాలోని 35 మంది ఆర్టిస్టులంతా చాలా అంకితభావంతో పనిచేశారు. వాళ్లు లేకపోతే ఈ సినిమా లేదు.

భాస్కర భట్ల .. శ్యామ్ ఇద్దరూ కూడా చాలా మంచి పాటలు రాశారు. దేవిశ్రీ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. 'ఇది కామెడీ  సినిమా అనకండి .. ఇందులో గొప్ప కంటెంట్ ఉంది' అని ఆయన అన్నారు. ఈ కథ అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంది.


ఈ సినిమా చూసినవాళ్లలో కొందరైనా  దాని విలువ తెలుసుకుంటారని నమ్ముతున్నాను. వరుణ్ 'ఎఫ్ 2'లో కంటే డిఫరెంట్ గా 'ఎఫ్ 3'లో కనిపిస్తాడు. ఆల్రెడీ మీరు ట్రైలర్ లో చూసే ఉంటారు. వరుణ్ లో ఇంత కామెడీ టైమింగ్ ఉందా అని మీరే ఆశ్చర్యపోతారు. తను ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు చేసాలని కోరుకుంటున్నాను.  

ఇక నా ఫేవరేట్ హీరో వెంకటేశ్ గారి విషయానికి వస్తే .. ఆయన ఎంతో ఎనర్జీని ఇస్తారు. ఆయన పెద్ద స్టార్ హీరో .. కానీ కామెడీ చేసేటప్పుడు తన ఇమేజ్ ను పక్కన పెట్టేసి ఒక  చిన్న పిల్లాడిలా పెర్ఫార్మ్ చేస్తారు. ఆయన గొప్పతనం అదే. 'ఎఫ్ 2'లో కంటే పదింతలు ఈ సినిమాలో ఆయన నవ్విస్తారు. మా జర్నీ ఇలాగే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను. నవ్వడం ఒక యోగం .. నవ్వకపోవడం ఒక రోగం .. నవ్వించడం ఒక భోగం .. ఇక్కడున్నవాళ్లంతా  అదే చేశారు. ఏమీ ఆలోచించకుండా థియేటర్ కి వెళ్లి సరదాగా నవ్వుకోండి .. అంతే" అంటూ ముగించాడు.
Tags:    

Similar News