పద్మావత్.. తెలుగు వాళ్లకు పండగే

Update: 2018-01-15 17:54 GMT
పద్మావతి.. ఈ మధ్య కాలంలో దీని కంటే వివాదాస్పదమైన, చర్చనీయాంశమైన సినిమా మరొకటి లేదు. ముందుగా ఈ చిత్రం వివాదాలతోనే వార్తల్లోకి వచ్చింది. ఆ తర్వాత దీని ట్రైలర్ చూసి అందరూ మెస్మరైజ్ అయిపోయి.. తెగ చర్చించుకున్నారు. కానీ ఆపై సినిమా ముచ్చట్లు పక్కకు వెళ్లిపోయాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు.. సెన్సార్ అడ్డంకులే హైలైట్ అయ్యాయి. డిసెంబరు 1నే రావాల్సిన ఈ చిత్రం ఈ వివాదాల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. ఐతే ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసి జనవరి 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఐతే రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు కానీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా సజావుగా రిలీజవుతుందా అన్నది అనుమానంగానే ఉంది. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలు ఈ చిత్రాన్ని నిషేధించాయి. అయినప్పటికీ ఎలాగైనా 25న సినిమాను రిలీజ్ చేసి తీరాలనే పట్టుదలతో ఉన్నాడు దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ. ఉత్తరాది వాళ్ల సంగతేమో కానీ.. దక్షిణాదిన మాత్రం ఈ చిత్రానికి ఏ అడ్డంకులూ లేవు. ‘పద్మావత్’గా పేరు మార్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతుండటం విశేషం. పైగా ఇక్కడ త్రీడీలోనూ విడుదల చేస్తారట. ఈ వివాదాల సంగతి వదిలేసి వెనక్కి వెళ్తే ‘పద్మావతి’ ట్రైలర్ ఒక దృశ్య కావ్యం చూడబోతున్న అనుభూతినే కలిగించింది. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే దక్షిణాది ప్రేక్షకులకు మాత్రం పండగే.
Tags:    

Similar News