ట్రైలర్ టాక్: 1600 మంది అమ్మాయిలను ప్రేమించిన 'పాగల్' ప్రేమ్ కథ..!

Update: 2021-08-10 05:47 GMT
విభిన్న తరహా చిత్రాలతో యూత్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''పాగల్''. ఈ సినిమాతో కొత్త దర్శకుడు న‌రేష్ కొప్పలి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ - సిమ్రాన్ చౌదరి - మేఘ లేఖ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'పాగల్' థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

'నా పేరు ప్రేమ్.. నేను 1600 మంది అమ్మాయిలను ప్రేమించాను' అని విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. 'ఇక్కడ గీత ఎక్కడ ఉంటది సర్?' అని అడుగగా.. 'కొప్పలి గీత, బెక్కం గీత, బెజవాడ గీత, మార్వాడీ గీత, టెన్త్ పాస్ అయిన గీత, పబ్జీ ఆడే గీత, లూడో ఆడే గీత, క్యాండీ క్రష్ ఆడే గీత.. ఇలా చాలామంది గీత లు ఉన్నారు.. నీకు ఏ గీత కావాలి?' అని విశ్వక్ చెప్పే డైలాగ్ అలరిస్తోంది. మన వాడి దగ్గర అమ్మాయిల లిస్ట్ చాలా పెద్దదే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మన హీరో కనిపించిన ప్రతీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పుకుంటూ గులాబీ పువ్వులు ఇస్తూ కనిపిస్తున్నాడు. కాలేజీ గర్ల్స్ నుంచి చివరకు రోడ్లు ఊడ్చే వారి వరకు.. ఎవరినీ వదలకుండా లవ్ ట్రైల్స్ చేస్తున్నాడు.

అలాంటి సమయంలో మన పాగల్ లైఫ్ లోకి లవ్ అంటే అస్సలు నచ్చని.. చాలా అంటే చాలా ఎక్కువ నచ్చని అందమైన అమ్మాయి నివేదా పేతురాజ్ వచ్చింది. అలానే కిస్ అంటే లిప్స్ మీదే చేయాలా? అని అడిగే అమాయకపు అమ్మాయి మేఘ లేఖ కూడా మన హీరోకి తారసపడింది. ఈ క్రమంలో సిమ్రాన్ చౌదరి కూడా వచ్చి చేరింది. అయితే అన్ని వందల మందికి ప్రపోజ్ చేసిన ప్రేమ్.. చివరకు నివేదా ప్రేమ కోసం పరితపిస్తు పాగల్ గా మారినట్లు ట్రైలర్ లో చూపించారు. 'నేను చాలామంది అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పాను.. కానీ లవ్ నిన్ను మాత్రమే చేస్తున్నా' అని విశ్వక్ చెప్తుండటంతో ఈ విషయం అర్థమవుతోంది.

మన పాగల్ ఇలా కనిపించిన ప్రతీ అమ్మాయిని ఎందుకు ప్రపోజ్ చేస్తున్నాడు?, అతని దృష్టిలో ఐ లవ్ యూ చెప్పడానికి, లవ్ చేయడానికి మధ్య డిఫరెన్స్ ఏంటి? చివరకు ప్రేమ్ కు నిజమైన ప్రేమ దొరికిందా లేదా? అనేది తెలియాలంటే ''పాగల్'' సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో ప్రేమ్ పాత్రలో విశ్వక్ మంచి ఈజ్ తో నటించినట్లు తెలుస్తోంది. రాహుల్ రామకృష్ణ - మురళీ శర్మ - జబర్దస్త్ మహేష్ - ఇంద్రజ శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.

'పాగల్' చిత్రానికి రథన్ సంగీతం సమకూర్చారు. ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ ఎడిటింగ్ వర్క్ చేశారు. దిల్‌ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ - లక్కీ మీడియా బ్యానర్స్‌ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వరుస విజయాలతో జోష్ మీదున్న విశ్వక్ సేన్ కు ''పాగల్'' ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


Full View


Tags:    

Similar News