ఇక‌పై తెలంగాణ థియేట‌ర్ల‌లో పార్కింగ్ ఫీజు వ‌సూల్?

Update: 2021-07-18 03:30 GMT
ఇంత‌కాలం తెలంగాణ వ్యాప్తంగా మ‌ల్టీప్లెక్సులు సింగిల్ థియేట‌ర్ల‌కు పార్కింగ్ ఫీజును ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం తెచ్చిన జీవోతో ఎగ్జిబిట‌ర్లు ఖంగు తిన్నారు. మాల్స్ మల్టీప్లెక్సుల్లో ఇష్టానుసారం పార్కింగ్ ఫీజు దోపిడీని తిండి ప‌దార్థాల రేట్ల బాదుడును నిలువ‌రించేందుకు టీప్ర‌భుత్వం చాలా సీరియ‌స్ గా తీసుకున్న నిర్ణ‌య‌మ‌ది. అయితే ఆ జీవోని స‌వ‌రించాల‌ని చాలా కాలంగా ఎగ్జిబిట‌ర్లు ఉద్య‌మిస్తున్నారు. పార్కింగ్ ఫీజు ర‌ద్దు వ‌ల్ల త‌మ‌కు గిట్టుబాటు కావ‌డం లేద‌ని థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ ఇబ్బందిగా మారింద‌ని వాదిస్తున్నారు.

ఎట్ట‌కేల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం పార్కింగ్ ఫీజుపై వెసులుబాటు క‌ల్పించే వీలుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నేడు తెలంగాణ ఛాంబ‌ర్ త‌ర‌పున సినీపెద్ద‌లు కొంద‌రు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సానికి స‌మ‌ర్పించిన మెమోరండంలో పార్కింగ్ ఫీజు వ‌సూల్ అనే టాపిక్ ప్ర‌ధానంగా ఉంది.

ఇక క‌రోనా త‌గ్గిన నేప‌థ్యంలో తెలంగాణ అంతటా థియేటర్లు జూలై 23 నుండి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిసింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కిషోర్ బాబు- సునీల్ నారంగ్- అభిషేక్ నామా తదితరులు మంత్రి తలాసాని శ్రీనివాస్ యాదవ్ ను కలుసుకుని మెమోరాండం సమర్పించారు. ఈ మెమోరాండంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన కొన్ని చర్యలను ప్ర‌తిపాదించారు. అవి థియేటర్ యజమానులకు మరియు నిర్వహణకు గత రెండున్నర నెలల్లో జరిగిన నష్టాల నుండి ఉపశమనం కలిగిస్తాయి. పార్కింగ్ ఫీజు.. విద్యుత్ బిల్లులు.. థియేటర్‌పై ఆస్తిపన్ను ..జిఎస్‌టి తగ్గింపు వంటి డిమాండ్లు ప్ర‌ధానంగా ఉన్నాయి.

సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సంద‌ర్భంగా అన్నారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేయ‌గా వాటిపై మంత్రి హామీ ఇచ్చారు.

కరోనా మహమ్మారి కారణంగా సుమారుగా ఒక సంవత్సరం నుండి సినిమా థియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయని మంత్రికి వివరించారు. సినిమా ఎగ్జిబిటర్స్- సినిమా దియేటర్ల నిర్వహకులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయామని ప్రభుత్వం ఈ కష్టకాలంలో అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. ప్రధానంగా సినిమా థియేటర్లు మూసి ఉంచిన సమయానికి ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని.. సింగిల్ స్క్రీన్ ధియేటర్ లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని SGST ట్యాక్స్ ను రద్దు చేయాలని GO 75 ను పునరుద్దరించాలని షూటింగ్ అనుమతులకు వసూలు చేసే చార్జీలను తగ్గించాలని తదితర డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో TSFDC ED కిషోర్ బాబు ఉన్నారు.

నాలుగు నెల‌లుగా మూత ప‌డిన థియేట‌ర్లు:

తెలంగాణ అంతటా థియేటర్లు ఏప్రిల్ మూడవ వారం నుండి మూసివేయబడ్డాయి. గత నెల యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లను తిరిగి తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ నిర్మాతలు ఎగ్జిబిటర్లు పంపిణీదారులు సిద్ధంగా లేరు, ఎందుకంటే కోవిడ్ -19 కేసులు త‌గ్గ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. అంతేకాక నిర్మాతలు AP లోని థియేటర్లు కూడా తిరిగి తెరవాలని అక్క‌డ టికెట్ ధ‌ర‌లు పెర‌గాల‌ని ఎగ్జిబిట‌ర్లు నివేదిస్తున్నారు.

టీకా వేయిస్తేనే థియేట‌ర్ల‌లోకి.. తెలంగాణలోని థియేటర్లకు వంద శాతం సీటింగ్ సామర్థ్యం అనుమతించనున్నారు. థియేటర్ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలను విడుదల చేయలేదు. బహుశా మొదటి మోతాదుతో టీకాలు వేసే వ్యక్తులను సినిమా హాళ్ళలో అనుమతించవచ్చ‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News