పైరసీకి బలైన విలక్షణ నటుడి సినిమా

Update: 2015-07-08 06:20 GMT
నిన్నటికి నిన్న బాహుబలి టీమ్‌ పైరసీకారులపై దండయాత్ర ప్రారంభించింది. మాటల యద్ధంతో మొదలెట్టి సైబర్‌ వార్‌కి తెరలేపారు. స్పెషల్‌ కోడ్‌, వాటర్‌ మార్క్‌.. ఎవరైనా కాపీ చేయాలని చూస్తే పట్టించేసే టెక్నాలజీని ఉపయోగించాం అంటూ వార్‌ మొదలు పెట్టారు. సంవత్సరాల తరబడి ఎంతో శ్రమించి, భారీ ధనాన్ని వెచ్చింది తెరకెక్కించిన సినిమా చూస్తూనే పైరేట్‌ బారిన పడుతుంటే ఎవరైనా తట్టుకోగలరా? చెట్టు ముందా? విత్తు ముందా? అన్నట్టు పైరసీపై యుద్ధం అనాదిగా సాగుతున్నదే అయినా దాన్ని నిలువరించే అవకాశమే లేకుండా పోయింది. ఇప్పటికే ఎంతో మంది నిర్మాతలు బోరున విలపించారు ఈ మహమ్మారీ దెబ్బకి. ఇప్పుడు అదే తీరుగా పైరసీ బారిన పడింది పాపనాశం.

మలయాళ హిట్‌ చిత్రం 'దృశ్యం' తమిళ్‌లో పాపనాశం పేరుతో తెరకెక్కి బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్‌-గౌతమి పెయిర్‌ సూపర్బ్‌ అంటూ తంబీలు ఈ సినిమాని సూపర్‌హిట్‌ చేసేశారు. కానీ ఏం ప్రయోజనం పాపనాశం రిలీజైన మూడోరోజే ఆన్‌లైన్‌లో టొరెంట్ల రూపలో పైరసీ అందుబాటులోకి వచ్చేసింది. అసలు దీన్ని ఎవరు అప్‌లోడ్‌ చేశారు? అన్నది కూడా కనుక్కోలేని పరిస్థితి. దీనిపై దర్శకుడు జీతూ జోసెఫ్‌ మాట్లాడుతూ ఇప్పటికే పైరసీ కంట్రోల్‌ సెల్‌కి అర్జీ పెట్టుకున్నాం. పోలీస్‌ సాయంతో వెతుకుతున్నారు. ఎవరు దొరికినా శ్రీకృష్ణ జన్మస్థానమే. కానీ ఏం ప్రయోజనం? సినిమా తీయడం ఎంత కష్టమో.. వేరొక క్రియేటర్‌కే తెలుస్తుంది. క్రియేటర్‌ కష్టం క్రియేటర్‌ మాత్రమే అర్థం చేసుకోగలడు. పైరేట్‌లకు అది అవసరమా? అంటూ మనసులోని బాధని వెల్లగక్కాడు.
Tags:    

Similar News