డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న ''రొమాంటిక్'' సినిమా ప్రమోషన్స్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భాగం పంచుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పూరీ చేసిన 'బుజ్జిగాడు' 'ఏక్ నిరంజన్' సినిమాలు యంగ్ రెబల్ స్టార్ కు మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆ సాన్నిహత్యం కొనసాగుతూనే ఉంది. అందుకే ఇప్పుడు పూరీ ఆకాష్ సినిమాకు తనవంతు సపోర్ట్ ఇస్తున్నారు ప్రభాస్.
''రొమాంటిక్'' చిత్రాన్ని అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల ప్రభాస్ ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనూహ్య స్పందన తెచ్చుకున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో లేటెస్టుగా మరో ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో 'పుట్టింది పడుకోడానికి కాదు.. పోయాక పడుకో బే' అని ఆకాష్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
అయితే ఇప్పుడు ఇదే డైలాగ్ ను ఆకాష్ పూరితో కలిసి డార్లింగ్ ప్రభాస్ చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'రొమాంటిక్' ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ఈ డైలాగ్ తో రీల్స్ చేసి అలరించారు. ఈ చిత్రం నుండి ఏదైనా డైలాగ్ లేక పాటకి సంబంధించి రీల్స్ క్రియేట్ చేసి.. 'రొమాంటిక్ రీల్స్' అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చిత్ర బృందం పేర్కొంది. ఇందులో లక్కీ వినర్స్ కు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ తో పాటుగా ప్రీమియర్ టికెట్స్ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపారు.
కాగా, 'రొమాంటిక్' చిత్రానికి పూరి జగన్నాథ్ కథ - స్క్రీన్ ప్లే - మాటలు అందించారు. పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఇందులో ఆకాష్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. నరేష్ రానా సినిమాటోగ్రఫీ అందించారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరీ - ఛార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పాన్ ఇండియా స్టార్ చేస్తున్న ప్రమోషన్స్.. ఆకాష్ పూరీ సినిమాకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.