విడిపోవడానికి మించిన బాధలేదు: చైతూ విడాకులపై ప్రకాశ్ రాజ్

Update: 2021-10-04 04:33 GMT
సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా రాణిస్తూ, ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు చాలామందే ఉన్నారు. కొన్ని జంటలు అన్యోన్యతకు .. ఆదర్శానికి నిదర్శనంగా నిలిచాయి. మరి కొన్ని జంటలు ఆయా కారణాలతో విడిపోయాయి. అలా విడిపోయిన జంటల జాబితాలో చైతూ .. సమంత చేరడమే దురదృష్టం. నిజానికి సమంత - చైతూ విడిపోయేరోజు ఒకటి వస్తుందని ఎవరూ అనుకోలేదు. బహుశా వారు కూడా అనుకుని ఉండరేమో. కానీ అలాంటి పరిస్థితి వచ్చింది .. అందరినీ ఆశ్చర్యపరుస్తూ తనపని తాను చేసుకుపోయింది.

ఒక కథానాయికగా సమంత ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె అభినయాన్ని ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారు. మొదటి నుంచి కూడా సమంత చాలా యాక్టివ్. తెరపై ఎంతగా అల్లరి చేస్తుందో .. బయటకూడా అలాగే ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఫేస్ తో కనిపించే ఆమెను ఆరాధించేవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి సమంత - చైతూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం చాలామందికి ఆనందాన్ని కలిగించింది. అమ్మాయి అదృష్టవంతురాలు .. అక్కినేని ఫ్యామిలీలో పడిందని చెప్పుకున్నారు.

ఇక చైతూ విషయానికి వస్తే కెరియర్ పరంగా అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ ఇప్పుడిప్పుడే నిలబడుతున్నాడు. తన కెరియర్ గురించి .. తన సినిమా గురించి తప్ప ఆయన ఎక్కడా ఏ విషయంలోను జోక్యం చేసుకోడు. తాను ఒక స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడికీ, నట దిగ్గజం అక్కినేనికి మనవడిననే గొప్పతనాన్ని ఎక్కడా చూపించిన దాఖలాలు కనిపించవు. ఎప్పుడూ కూల్ గా కనిపిస్తూ తనపని తాను చేసుకుపోవడమే ఆయనకి తెలుసు. అందువలన ఈ ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు లేవని అంతా అనుకున్నారు.

పెళ్లి తరువాత ఇద్దరూ కూడా చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వచ్చారు. వాళ్ల సరదాలు .. షికార్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చేవి. అవి చూసి కూడా అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ కెరియర్ పరంగా ముందుకు వెళుతున్నారనే అనుకున్నారు. కానీ విధి వారిని విడాకుల దిశగా నడిపించింది. ఏం జరిగిందో తెలియదుగానీ, ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించారు. నిజంగా ఈ నిర్ణయం అభిమానులకు షాక్ ఇచ్చింది. కొన్ని రోజులుగా ఈ ప్రచారం జరుగుతున్నా, అందులో నిజం ఉండకపోవచ్చని అనుకున్నారు.

సమంత .. చైతూ ఎంత ప్రేమగా ఉండేవారనేది బయటివారికన్నా ఇండస్ట్రీకి చెందినవారికి ఎక్కువగా తెలుసు. అందువలన ఈ విషయం తెలిసిన తరువాత చాలామంది బాధపడ్డారు. అలా జరగకుండా ఉండవలసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు."సమంత .. నాగచైతన్య విడాకులు తీసుకోవడం నాకు చాలా బాధను కలిగించింది. గతంలో నేను కూడా విడాకులు తీసుకున్నవాడినే. ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోతే ఎంత బాధగా ఉంటుందనేది నాకు తెలుసు. ఆ పెయిన్ ను నేను అనుభవించాను. ఇంతటి బలమైన నిర్ణయాన్ని తీసుకోవడమనేది వారి వ్యక్తిగతం విషయం" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News