ప్రీమియర్ టాక్: 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' ఎలా ఉందంటే..?

Update: 2022-06-30 14:32 GMT
టాలెంటెడ్ హీరో ఆర్. మాధవన్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ''రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్''. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త, ఇండియన్ ఏరోస్పేస్ ఇంజనీర్ పద్మభూషణ్ నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ బయోపిక్.. రేపు (జులై 1) శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే అంతకంటే ముందుగా ఈరోజు గురువారం పలు ఏరియాల్లో ఈ మూవీ ప్రీమియర్ షోలను ప్రదర్శించారు.

'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' చిత్రాన్ని ఇటీవలే 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించగా.. అక్కడ అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ప్రీమియర్స్ నుంచి కూడా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణన్‌ ఒకరు. ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలకు దీటుగా ఎదిగిన నంబి.. ఇస్రో చేపట్టిన అనేక గొప్ప ప్రాజెక్టుల్లో భాగమయ్యారు.

అయితే ఇస్రో పరిశోధనలకు సంబంధించిన విషయాలు మరియు క్రయోజెనిక్ ఇంజిన్ల సమాచారాన్ని పాకిస్థాన్‌ కు చేరవేశారనే ఆరోపణలపై దేశ ద్రోహం కేసు పెట్టడంతో.. నంబి నారాయణ్ 50 రోజులు జైలు జీవితం గడిపారు. సీబీఐ దర్యాప్తులోనూ సుప్రీంకోర్టు విచారణలోను ఆయన నిర్దోషి అని తేలింది. కోర్టు ఆదేశాల మేరకు కేరళ ప్రభుత్వం రూ.1.3 కోట్ల పరిహారాన్ని చెల్లించింది. ఇలాంటి భావోద్వేగమైన జీవితాన్ని మాధవన్ నిర్మాతగా, దర్శకుడిగా మారి తెరకెక్కించారు.

నంబీ నారాయణ్ ప్రిన్స్‌ టన్ యూనివర్సిటీ నుంచి అతి తక్కు కాలంలో పీహెచ్‌డీ ఎలా పూర్తి చేశాడు? నాసాలో ఉన్నత పదవిని తిరస్కరించి ఇండియాకు ఎందుకు తిరిగి వచ్చాడు? ఎలాంటి పరిస్థితుల్లో నంబి నారాయణ్ అరెస్ట్ అయ్యారు? కేరళ పోలీసులు నంబి ని ఎలాంటి చిత్రహింసలకు గురి చేశారు? తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి నంబి ఎలా పోరాడారు? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? నంబిపై కుట్ర కేసులో అసలు ఏం జరిగింది? అనేది తెలియాలంటే 'రాకెట్రీ' సినిమా చూడాల్సిందే.


నంబి నారాయణ్ పాత్రలో మాధవన్ ఒదిగిపోయి నటించారని తెలుస్తోంది. ఆ పాత్రకు అనుగుణంగా మాధవన్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి మెచ్చుకొని తీరాల్సిందే. యువకుడిగా ఉన్నప్పటి నుంచి.. ముసలివాడయ్యే వరకు రకరకాల గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. పాత్ర కోసం ఆయన కష్టపడిన విధానం.. ఆరేళ్ల కృషి తెర మీద కనిపిస్తుంది. మాధవన్ కెరీర్ లో ఇదొక బెస్ట్ మూవీగా నిలిచి పోతుందనడంలో అతిశయోక్తి లేదు.

దర్శకుడిగానూ ఆర్ మాధవన్ మంచి మార్కులు కొట్టేశారు. ఎంచుకున్న పాయింట్‌ ను పూర్తిస్థాయి సినిమాగా విస్తరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అత్యంత సాంకేతికతతో కూడిన కంటెంట్‌ ను కూడా సాధారణ ప్రేక్షకులకు కూడా అర్ధం అయ్యేలా ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు. నారాయణ్ ఎదుర్కొన్న పరిస్థితులు.. అరెస్ట్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ సిచ్యుయేషన్ చూసి ప్రేక్షకుడు భావోద్వేగాలను లోనయ్యేలా ఈ సినిమాని తెర పై ఆవిష్కరించారు.

నంబి నారాయణ్ భార్య మీనాగా సాధారణ గృహిణి పాత్రలో సిమ్రాన్ మెప్పించింది. క్లైమాక్స్‌ లో మాధవన్ తో పాటుగా సిమ్రాన్ నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. కలాం పాత్రలో గుల్షన్ గ్రోవర్ ఆకట్టుకున్నారు. అతిథి పాత్రలో కనిపించిన సూర్య సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సిర్షా రే సినిమాటోగ్రఫీ.. శ్యామ్ సీఎస్ రీరికార్డింగ్ ఆయువుపట్టుగా నిలిచాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన బయోపిక్స్‌ లో 'రాకెట్రీ' ముందు వరుసలో నిలుస్తుందని చెప్పాలి.
Tags:    

Similar News