రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్న 'పుష్ప' ఫస్ట్ సాంగ్..!

Update: 2021-08-14 08:30 GMT
'ఆర్య' 'ఆర్య 2' తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌ లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా ''పుష్ప''. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో లేటెస్టుగా సినిమాలోని ఫస్ట్ సాంగ్ 'దాక్కో దాక్కో మేక' లిరికల్ వీడియో ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో వచ్చిన 'దాక్కో దాక్కో మేక' పాటకు విశేష స్పందన లభిస్తోంది. యూట్యూబ్ లో వ్యూస్ - లైక్స్ పరంగా కేక‌లు పుట్టిస్తోంది. ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ సింగర్స్ పాడిన ఈ పాటను ఒకేసారి విడుదల చేశారు. తెలుగు వెర్సన్ కు గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా.. శివమ్ ఆలపించారు.

'దాక్కో దాక్కో మేక' సాంగ్ 8.5 మిలియన్లకు పైగా వ్యూస్ మరియు 660K లైక్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ లోనే కాకుండా, ఏకంగా సౌత్ లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న లిరికల్ సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈసారి కేవలం వ్యూస్ అని కాకుండా.. ఈ సాంగ్ తో యూట్యూబ్ లైక్స్ విష‌యంలో రికార్డులు బద్దలు కొట్ట‌డానికి బ‌న్నీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

ఇప్పటికే 660K లైక్స్ సాధించిన 'దాక్కో దాక్కో మేక' లిరికల్ వీడియోతో తక్కువ సమయంలో 1 మిలియన్ పైచిలుకు లైకులు అందుకోవాల‌ని బ‌న్నీ ఫ్యాన్స్ టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తోంది. 24 గంటల్లో 'పుష్ప' ఫస్ట్ సింగిల్ వ్యూస్ ని ఒకసారి చూస్తే.. హిందీలో 4.35M - కన్నడలో 1.21M - మలయాళంలో 800K - తమిళ్ లో 2M వ్యూస్ రాబట్టింది. రాబోయే రోజుల్లో ఈ సాంగ్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.

'దాక్కో దాక్కో మేక' సాంగ్ ఆడియో పరంగానే కాకుండా విజువల్ గా కూడా వీక్షకులకు మంచి అనుభూతి ఇచ్చింది. ఇందులో అల్లు అర్జున్ లుక్ - హావభావాలు - డ్యాన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 'వెలుతురు తింటది ఆకు.. ఆకుని తింటది మేక.. మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి.. పులినే తింటది చావు.. చావును తింటది కాలం.. కాలాన్ని తింటాది కాళి.. ఇది మహా ఆకలి..' అంటూ సాగిన ఈ పాట సినిమా కథలోని మూల విషయాన్ని చెబుతోంది.

జీవశాస్త్రంలోని ఆహార గొలుసు మాదిరిగా.. ప్రతి పదమూ పుష్పరాజ్‌ పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా చంద్రబోస్ 'పుష్ప' ఫస్ట్ సాంగ్ రాసారని అర్థం అవుతోంది. ఈ పాటలో గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుక్కూ - బన్నీ - దేవిశ్రీ కలయికలో మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ రాబోతోందని ఈ పాటని బట్టి తెలుస్తుంది.

కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రెండు భాగాలుగా 'పుష్ప' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' పేరుతో క్రిస్‌మస్ పండుగ సందర్భంగా డిసెంబర్‌ లో విడుదల కానుంది. ఇది అల్లు అర్జున్ - సుకుమార్ లకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.




Tags:    

Similar News