సొసైటీ కోసమే పెడుతుంటాడు ఈ రియల్ హీరో

Update: 2016-03-15 07:19 GMT
పది కోట్లున్న వాడు దాన్ని వంద కోట్లు ఎలా చేయాలా అని చూస్తాడు.. వంద కోట్లున్నవాడు వెయ్యి కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఇలా టార్గెట్లు పెరుగుతూ పోతాయి తప్ప.. తమకున్నదాంట్లో కొంత పేదలకు, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు ఖర్చు పెడదామని నూటికి 99 శాతం మందికి అనిపించదు. కానీ మిగిలిన ఒక్క శాతం మంది మాత్రం సంపాదనలో సగం సమాజానికే ఖర్చు పెట్టేస్తారు. అందులోనూ రాఘవ లారెన్స్ లాంటి వాళ్లకు అసలు ఈ లెక్కలేవీ కూడా ఉండవు. సంపాదనంలో సింహ భాగం సొసైటీ కోసమే పెడుతుంటాడు ఈ రియల్ హీరో. అలాగని తాను చేసే సాయం గురించి పెద్దగా ప్రచారం కూడా చేసుకోడు లారెన్స్.

లారెన్స్ అందించిన సాయం ద్వారా ఇప్పటికి 128 మంది పేదలకు మేజర్ ఆపరేషన్లు జరిగాయి అంటే నమ్మగలరా? తాజాగా ఓ పేద పిల్లోడికి ఇలాగే సర్జరీ చేయించి అతడి ప్రాణాలు నిలబెట్టాడు లారెన్స్. మామూలుగా ఇలా సర్జరీలు జరిగినప్పుడల్లా చెప్పుకోడు కానీ.. ప్రాణాపాయం నుంచి బయటపడి బోసి నవ్వులు నవ్వుతున్న పిల్లాడిని అందరికీ పరిచయం చేద్దామనిపించిందేమో.. తల్లీ బిడ్డల ఫొటో పెట్టి విషయం చెప్పాడు లారెన్స్. మొన్న చెన్నై వరదల సందర్భంగా లారెన్స్ దాదాపు నెల రోజుల పాటు తన పనులన్నీ మానుకుని.. తన టీంతో కలిసి ఎంత కష్టపడ్డాడో.. ఎన్ని వేల మంది కడుపులు నింపాడో.. ఎంత ఖర్చు పెట్టాడో అందరికీ తెలుసు. ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు సైలెంటుగా చేసుకుపోతుంటాడు లారెన్స్. అతడి పెద్ద మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Tags:    

Similar News