RRR సీక్వెల్ సినిమాల మధ్య క్లాష్ పై రాజమౌళి స్పందన

Update: 2021-10-30 11:30 GMT
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం) సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మాస్టర్ స్టోరీ టెల్లర్ గా పిలవబడే జక్కన్న.. మూవీ ప్రమోషనల్ స్ట్రాటజీస్ అమలు పరచడం స్టార్ట్ చేశారు. ఈ భారీ మల్టీస్టారర్ కోసం ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ - ఆర్.ఆర్.ఆర్ బృందం మధ్య ఒప్పందం కుదిరింది. ‘PVR’ సంస్థ పేరుని కొన్ని నెలల పాటు ‘PVRRR’ గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ కొనసాగనుందని తెలిపారు.

ముంబైలో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ‘PVRRR’ లోగోను దర్శకుడు రాజమౌళి - పీవీఆర్ ఛైర్మన్ అజయ్ బిజ్లీ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఒక్కరోజు గ్యాప్ తో ‘గంగూబాయి కతియావాడి’ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు రిలీజ్ అవడం గురించి మాట్లాడుతూ.. ''సినిమాల మధ్య క్లాష్ అనేది బిజినెస్ ని ఏమీ దెబ్బతీయదు. ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలైనా.. బాగుంటే ప్రేక్షకులు నాలుగింటిని చూస్తారు. ప్రస్తుతం ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి.. అన్ని సినిమాలు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. జనవరిలో చాలా సినిమాలు రాబోతున్నాయి. అన్ని చిత్రాలు మంచి వసూళ్లు రాబట్టి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

పాండమిక్ అనేది నా సినిమా సమస్య మాత్రమే కాదు.. ఇది సినిమా ఫీల్డ్ సమస్య మాత్రమే కాదు, ఇది మొత్తం మానవాళి సమస్య. కాబట్టి నా సినిమాకి ఏమి జరుగుతుందో అని కూర్చొని ఏడ్చే అవకాశం లేదు. ఆ అడ్డంకిని ఎలా అధిగమిస్తాము.. ప్రజలు థియేటర్లను వచ్చిన మళ్లీ మళ్లీ సినిమా చేసేలా ఎలా ఉత్తేజపరిచారు అనేది ముఖ్యమని రాజమౌళి తెలిపారు. RRR సినిమాకు సీక్వెల్ ఉంటుందనే వార్తలకు సమాధానంగా.. ''కథకు అవసరం కాబట్టి నేను 'బాహుబలి' చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించాను. 'ఆర్.ఆర్.ఆర్'లో కథ మొత్తం ఒకే సినిమాలో వస్తుంది. మార్కెటింగ్ బిజినెస్ కోసం సినిమాను రెండు మూడు భాగాలుగా తీయడంపై నాకు నమ్మకం లేదు. నేను ఆ విధంగా సినిమాలు తీయాలని అనుకోను'' అని రాజమౌళి చెప్పారు.

''నేను ఎప్పుడూ థియేటర్ల కోసమే సినిమాలు చేస్తాను. ఎక్కువమంది ప్రేక్షకులు ఒక్కచోట చేరి ఒకరినొకరు ఇంటరాక్ట్ అవ్వాలని.. అందరూ కలిసి సినిమాని ఆస్వాదించాలని కోరుకుంటాను. నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది అదే. అందుచేత నా సినిమాలు థియేటర్లోనే విడుదలవుతాయి. ఎలాంటి సందేహం లేదు'' అని అన్నారు రాజమౌళి.

"నేను దక్షిణాది లేదా ఉత్తరాది.. హిందీ లేదా తమిళం, కన్నడ అనే విధంగా నటీనటులను చూడటం మానేశాను. భారతీయ ప్రేక్షకులు భాషా బేధాలను అధిగణించారు. నాకు ఈ భాష నటులు, ఆ భాష నటులు అని భేదాలు ఏమీ లేవు. నా కథ, స్క్రిప్ట్ కు ఎవరూ సరిపోతారనుకుంటే వారినే సంప్రదిస్తాను. ‘బాహుబలి’ అనే సినిమాను ఉపయోగించుకొని ఎవరి దగ్గరికి వెళ్లను. నా స్క్రిప్ట్ ను నమ్ముకొనే నేను ముందుకు వెళ్తాను'' అని జక్కన్న చెప్పుకొచ్చారు.

కాగా, 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా అల్లుకున్న కల్పిత కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ - శ్రియ - సముద్రఖని ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల కానుంది.
Tags:    

Similar News