‘నేనే రాజు నేనే మంత్రి’ మిస్సవడంపై రాజశేఖర్

Update: 2017-10-30 08:18 GMT
సోలో హీరోగా రానా దగ్గుబాటి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ‘నేనే రాజు నేనే మంత్రి’. సీనియర్ దర్శకుడు తేజకు ఇది కమ్ బ్యాక్ ఫిలిం అయింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఐతే నిజానికి ఈ సినిమా చేయాల్సింది సీనియర్ హీరో రాజశేఖర్. తేజ ముందు కథ చెప్పింది ఆయనకే. అప్పుడు అనుకున్న టైటిల్ ‘అహం’. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యాక ఆగిపోయినట్లు.. తేజ ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ల దగ్గరికొచ్చినట్లు వార్తలొచ్చాయి. ఐతే రాజశేఖర్ ఈ సినిమా ఎందుకు చేయలేకపోయారనే విషయంలో క్లారిటీ లేదు. రాజశేఖర్ ఇప్పుడు ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.

‘‘తేజ గారు ఆ కథ ముందు నాకే చెప్పిన మాట వాస్తవం. నేను ‘వందేమాతరం’ సినిమా చేస్తున్నప్పటి నుంచి తేజ నాకు తెలుసు. ఆ సినిమాకు కెమెరా అసిస్టెంటుగా పని చేశాడతను. నా భార్య జీవితకు తేజ క్లాస్ మేట్ కూడా. ఆ రకంగా కూడా అతను నాకు క్లోజ్. తేజను డైరెక్షన్ చేయమని ఒత్తిడి చేసిన వాళ్లలో నేనూ ఒకడిని. అతను ‘అహం’ పేరుతో నాకు కథ చెప్పాడు. అది చాలా బాగా వచ్చింది. క్లైమాక్స్ ముందు వరకు నాకు చాలా నచ్చింది. ఐతే క్లైమాక్స్ దగ్గర మా ఇద్దరికి ఏకాభిప్రాయం కుదరలేదు. నేనొకలా ఉండాలన్నాను. అతను ఒకలా రాశాడు. ఇలా అయితే నేను చేయనని చెప్పాను. ఇంకో హీరోతో చేయమని నేనే మామూలుగా చెప్పాను. అతను అలాగేనని రానాతో సినిమా చేశాడు’’ అని రాజశేఖర్ అన్నాడు.
Tags:    

Similar News