'ఆహ'లో రాజేంద్రప్రసాద్ రచ్చ మొదలు!

Update: 2021-12-21 08:46 GMT
'ఆహా'లో ఇప్పుడు కొత్తదనం కొలువు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. టాక్ షోలు .. వెబ్ సిరీస్ లు .. వెబ్ ఫిల్మ్ లతో సబ్ స్క్రై బర్ లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా 'ఆహా' నుంచి 'సేనాపతి' అనే వెబ్ ఫిల్మ్ పలకరించనుంది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో 'ఆహా' వారు ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, ట్రైలర్ తరహాలో ఒక వీడియోను వదిలారు. ఈ ట్రైలర్ ను బట్టి చూస్తుంటే ఇందులో టైటిల్ రోల్ ను రాజేంద్ర ప్రసాద్ పోషిస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమైపోతోంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో నరేశ్ అగస్త్య .. హర్షవర్ధన్ .. రాకేందుమౌళి కనిపిస్తున్నారు.

ఈ సినిమా కథలోని సారాంశాన్ని ఒక బుర్రకథ ద్వారా చెప్పిస్తూ, వీడియోను వదిలారు. ద్వాపరయుగంలో 'శమంతకమణి' చుట్టూ కథ తిరుగుతుంది. అలాగే ఈ కలియుగంలో ఈ కథ డబ్బు చుట్టూ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది. ఒక వైపున తన అసలుపేరైన కృష్ణమూర్తిగా రాజేంద్ర ప్రసాద్ చాలా సాదా సీదాగా కనిపిస్తూనే, చేయవలసిన పనులను సైలెంట్ గా చక్కబెడుతుంటాడు. ఇక మరో వైపున రౌడీ గ్యాంగ్ లకు .. పోలీసులకు మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. అందుకు కారణం డబ్బే అన్నట్టుగా అక్కడక్కడా కట్టలు కట్టలుగా కరెన్సీ కనిపిస్తూ ఉంటుంది.

ఈ వీడియోలో చాలా పాత్రలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ .. ప్రధానంగా రాజేంద్ర ప్రసాద్ - నరేశ్ అగస్త్యల పాత్రలను బేస్ చేసుకుని నడిచింది. బుర్రకథలో వినిపించే 'పోయింది ఒక్కటే .. పోరాటం ఒక్కటే, అవసరం ఒక్కటే .. అపనిందలు ఒక్కటే' అనే మాటలు ఈ కథను చెప్పకనే చెబుతున్నాయి. ప్రధానమైన పాత్రను పోషిచిన రాజేంద్ర ప్రసాద్ చివరిలో చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. చదరంగంలోని సేనాపతి పావును చూపిస్తూ .. "ఇదేంటో తెలుసా సేనాపతి .. దీంతో చాలా ప్రమాదం" అంటాడు. తాను చాలా ప్రమాదకరమైన వ్యక్తిని అనే అర్థంలో.

అడుగడుగునా ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాను, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మించింది. ఇంతకు ముందు 'ప్రేమ ఇష్క్ కాదల్' .. 'సావిత్రి' వంటి సినిమాలను తెరకెక్కించిన పవన్ సాధినేని ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇంట్రెస్టింగ్ వీడియో ద్వారా ఈ సినిమాపై ఆసక్తిని పెంచడంలో ఈ టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. తన వయసుకి తగిన పాత్రలో చాలా సాదా సీదాగా కనిపిస్తూ రాజేంద్రప్రసాద్ చేసిన కీలకమైన రోల్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అనిపిస్తోంది.


Full View
Tags:    

Similar News